Rains Alert to AP: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర సహా ఉత్తర బంగాళాఖాతం నుంచి రుతుపవనాలు క్రమంగా వైదొలగుతున్నాయని పేర్కొంది. తదుపరి రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా ఉపసంహరించుకునేలా పరిస్థితులు మారుతున్నాయని తెలిపింది.
అదే సమయంలో దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అక్టోబరు 14 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో ఇది మరింతగా బలపడే సూచనలు ఉన్నాయంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తీవ్ర తుపాను-అప్రమత్తమైన ప్రభుత్వం
Heavy Rains Across Andhra Pradesh: వచ్చే 4 రోజులు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వెల్లడించారు. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇవాళ కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీవర్షాలు, తీరం వెంబడి 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, తేలికపాటి వర్షాలు కురుస్తాయని సిసోదియా తెలిపారు. వచ్చే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటుచేయాలని సిసోదియా సూచించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సిసోదియా సూచించారు.