Rahul On Exit Polls : ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాతోపాటు దేశంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారిపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులు స్టాక్ మార్కెట్ స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు కోల్పోయిన అతిపెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్‌లో మోదీ, అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు.
అసలు మోదీ, అమిత్ షా పెట్టుబడి సలహా ఎందుకు ఇచ్చారని దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో రాహుల్ ప్రశ్నించారు. ఎన్నికల వేళ ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రి స్టాక్ మార్కెట్‌పై వ్యాఖ్యానించడాన్ని తొలిసారి చూసినట్లు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని బీజేపీ నేతలకు ముందే తెలుసని రాహుల్ ఆరోపించారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయని, ఆ తర్వాత జూన్ 4వ తేదీన కుప్పకూలాయని అన్నారు. అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణంపై జేపీసీ విచారణ కోరుతున్నట్లు తెలిపారు.
ఓటమిని జీర్ణించుకోలేకే!: బీజేపీ
స్టాక్ మార్కెట్ గురించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ ఖండించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే రాహుల్ గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత పీయూశ్ గోయల్ ఆరోపించారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపాలని ఓ వైపు మోదీ చూస్తుంటే, మరోవైపు ఇన్వెస్టర్లను రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని దుయ్యబట్టారు.
ఖర్గే అధ్యక్షతన CWC సమావేశం
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి-CWC ఈనెల 8వ తేదీన సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సహా ముఖ్యనేతలు CWC భేటీలో పాల్గొననున్నారు. లోక్‌సభలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కనుంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ లోక్‌సభలో పది శాతం సీట్లు కూడా సాధించలేకపోయింది.
అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రికార్డు సాధించింది. 1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ 13 కోట్లకుపైగా ఓట్లను సాధించింది. 40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ ఈ స్థాయిలో ఓట్లను పొందింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం భారీగా ఓట్లు సాధించిన హస్తం పార్టీ, ఆ తర్వాత అంతగా రాణించలేకపోయింది. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటింది.