Rahul Gandhi On Caste Census : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. తమను తాము దేశభక్తులుగా చెప్పుకునే వారు కుల గణన అనే ఎక్స్‌రే రిపోర్టుకు భయపడుతున్నారని విమర్శించారు. దాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత జరగబోయే ప్రక్రియ కులగణనే అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ్ సమ్మేళన్ సభలో రాహుల్ ప్రసంగించారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృష్టించిన ఆదాయ అసమానతలు, ఎక్స్‌రే లాంటి కులగణన చేయాల్సిన అవసరం గురించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రస్తావించామని ఆయన తెలిపారు.
"దేశంలోని టాప్ 200 కంపెనీల్లోని 25 కంపెనీలకు ప్రధాని మోదీ రూ. 16 లక్షల కోట్లు ఇచ్చారు. ఆ డబ్బుతో 25 సార్లు రైతుల రుణాలను మాఫీ చేసే అవకాశం ఉండేది. కానీ ఆ 25 మందికి ఇచ్చేందుకే మోదీ మొగ్గుచూపారు. 90 శాతం దేశ జనాభాకు ఎంతో కొంత మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి ఇవ్వబోతుంది. దేశ ప్రజలకు న్యాయం చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఎంతో కొంత న్యాయం చేసి తీరుతాం. మా మేనిఫెస్టోలో ఆ అంశాన్నే ప్రస్తావించాం. నాకు కులంపై ఆసక్తి లేదు. కానీ న్యాయంపై ఉంది. అన్యాయం జరిగిన 90 శాతం దేశ జనాభాకు న్యాయం చేయాలనే ఆసక్తి ఉంది. వారికి న్యాయం చేయడమే నా జీవిత ధ్యేయం. దేశంలోని 90 శాతం జనాభాకు అన్యాయం జరుగుతుండటాన్ని చూసి తట్టుకోలేకే కులగణన చేయాలని నిర్ణయించాం."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
'నేను 'నాన్ సీరియస్' రాజకీయ నాయకుడినా?'
మీడియా రంగంలోనూ ఒక్క ఓబీసీ, దళిత, గిరిజన యాంకర్ కూడా లేరని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా యాజమాన్యాల్లోనూ 90 శాతం దేశ జనాభాకు చెందినవారు దాదాపు లేరని తెలిపారు. 90 శాతం మంది దేశ ప్రజల డబ్బు జీఎస్టీ ఆదాయం రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందుతున్నా కానీ, నిధుల కేటాయింపులో మాత్రం వారే అన్యాయానికి గురవుతున్నారని రాహుల్ చెప్పారు.
"నన్ను మీడియాలోని ఓ వర్గం గతంలో నాన్ సీరియస్ పొలిటీషియన్‌గా చూపించే ప్రయత్నం చేసింది. ఉపాధి హామీ పథకం, భూసేకరణ బిల్లు, భట్టా పర్సౌల్ ఉద్యమం, నియమగిరి హిల్స్ వ్యవహారాల్లో నా ప్రమేయం ఉంది. మీడియాకు ఇవన్నీ నాన్ సీరియస్‌గా అనిపించాయి. కానీ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, విరాట్ కోహ్లీకి సంబంధించిన వార్తలు వాళ్లకు సీరియస్ అయిపోయాయి. 90 శాతం దేశ జనాభా తరఫున మాట్లాడుతుంటే నేను నాన్ సీరియస్ లీడర్‌ను ఎలా అవుతాను? న్యాయవ్యవస్థలోనూ ఇదే పరిస్థితి ఉంది. 650 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉంటే 90 శాతం జనాభాకు చెందిన వారు 100 మందే ఉన్నారు. దేశంలోని టాప్ 200 కంపెనీల్లోనూ దళితులు, గిరిజనులు, ఓబీసీలు అంతగా లేరు."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
'మోదీజీ కులాలు లేవంటారా? మీరు ఓబీసీ ఎలా అవుతారు ?'
"ప్రధాని మోదీ తాను ఓబీసీ అని పదేళ్లుగా చెప్పుకుంటున్నారు. నేను కులగణన గురించి మాట్లాడిన వెంటనే ఆయన మాట మార్చి కులాలు లేవు అంటున్నారు. కులాలు లేకపోతే మోదీజీ ఓబీసీ ఎలా అవుతారు? అలాంటప్పుడు ప్రధాని మోదీ తనకు కులం లేదని చెప్పుకోవాలి. ధనిక, పేద అనే రెండు కులాలు ఉన్నాయని ప్రధాని చెబుతున్నారు. మీరు చెబుతున్న కోణంలోనే పనిచేసి దేశంలోని పేదల జాబితాను బయటకు తీయండి. కచ్చితంగా పేదల జాబితాలో దళితులు, ఆదివాసీలు, బీసీలే అత్యధికంగా ఉంటారు. రాజకీయాల్లో రాజీ పడొచ్చు. కానీ లైఫ్ మిషన్‌లో రాజీపడకూడదు. కులగణన అనేది నా జీవిత లక్ష్యం. పాకిస్థాన్, చైనా, బాలీవుడ్ అంశాలను తెరపైకి తెచ్చి దళితులు, ఓబీసీలు, గిరిజనుల దృష్టిని మరల్చడమే బీజేపీ లక్ష్యం" అని రాహుల్ గాంధీ ఆరోపించారు.