Rahul Gandhi Lok Sabha Seat : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ పార్లమెంటు సీట్లలో నుంచి ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏ స్థానాన్ని వదులుకోవాలన్న అంశంపై రాహుల్ సతమతమవుతున్నారు. వరుసగా రెండుసార్లు పట్టం కట్టిన వయనాడ్‌ను వదులుకోవాలా, లేదా దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటలా ఉన్న రాయ్‌బరేలీని వదులుకోవాలా అన్న అంశం ఇప్పుడు రాహుల్‌ను ఇబ్బంది పెడుతోంది. దీనిపై రాహుల్ కూడా ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు. ఏదో ఒక స్థానాన్ని తప్పక వదులుకోవాల్సి ఉండడం వల్ల రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ వయనాడ్‌ను వదులుకుంటారని సంకేతాలిస్తూ కేరళ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
వదులుకునేది వయనాడేనా?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్ సభ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉందని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకరన్ సూచనప్రాయంగా వెల్లడించారు. తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్‌గాంధీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుధాకరన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ ఇక్కడ లేకపోయినా మనం బాధపడకూడదని సుధాకరన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ రాహుల్ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతకు మద్దతు ఇవ్వాలని కోరారు.
'డైలమాలోనే ఉన్నా'
అంతకుముందు, పార్లమెంట్ సభ్యుడిగా ఏ స్థానం నుంచి కొనసాగాలో అర్థం కాక అయోమయంలో పడినట్లు రాహుల్ తెలిపారు. రాయ్‌బరేలీ, వయనాడ్ పార్లమెంటు స్థానాల నుంచి ఏ స్థానాన్ని ఎంపిక చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నానని అన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నియోజకవర్గాల ప్రజలు ఆనందిస్తారని చెప్పారు. చాలామంది తాను ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటానన్న దానిపై ఊహాగానాలు రేపుతున్నారని, తనకంటే వారికే తాను ఏ స్థానాన్ని వదులుకుంటానో తెలుసని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీకి వచ్చినట్లుగా తనకు దేవుడి నుంచి సూచనలు ఏం రావని ఎద్దేవా చేశారు. వయనాడ్‌లో బుధవారం భారీ రోడ్‌షో నిర్వహించిన రాహుల్, కారు టాప్‌పై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలాది మంది యూడీఎఫ్ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్‌షో సాగిన దారిపొడవునా ఇరువైపులా బారులుతీరారు. ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇదివరకే రాయ్‌బరేలీ వెళ్లిన ఆయన వయనాడ్‌లోనూ పర్యటించారు.
అలా కామెంట్ చేసినందుకే హత్య! క్రైమ్ సినిమాను తలదన్నేలా దర్శన్ కేసు - Actor Darshan arrest