రాహుల్ గాంధీ కారు అద్దం పగిలిన ఘటనపై భిన్న ప్రకటనలు వచ్చాయి. ఆ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Rahul Gandhi Car Attack : బంగాల్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దం ధ్వంసమైంది. కాగా రాహుల్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. బుధవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.
మాల్దా జిల్లాలోని హరిశ్చంద్రపుర్లో రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందని బంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. రాహుల్‌ను భయం లేని వ్యక్తిగా అభివర్ణించారు అధీర్. ఈ చర్యకు తృణమూల్ కాంగ్రెసే కారణమని ఆరోపించారు.
'కారు వెనుక నుంచి వచ్చి ఎవరైనా రాళ్లు రువ్వి ఉండొచ్చు. భద్రతా బలగాలు పట్టించుకోవట్లేదు. అందుకే ఇలాంటి ఘటన జరిగింది. చిన్న ఘటనే అయినా రాహుల్ ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? రాహుల్‌కు సరైన భద్రత లేదు. ఇది ఎవరు చేయించారో మీకు అర్థమైందా? కాంగ్రెస్ ఎవరినీ అణగదొక్కదు. అడుగడుగునా రాహుల్ గాంధీని ఇబ్బందిపెడుతున్నారు' అని అధీర్ పేర్కొన్నారు.
బంగాల్‌లో ఒంటరిగానే!
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఇటీవలే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించారు. ఒకవైపు మమత ఇంత స్పష్టంగా ఒంటరిగా పోటీచేస్తామని చెబుతుంటే, కాంగ్రెస్ మాత్రం బంగాల్‌లో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా హోల్డ్‌లోనే ఉన్నట్లు తెలిపింది. సీట్ల సర్దుబాటుపై తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాయని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ తెలిపారు.
టీఎంసీ ఇంకా ఇండియా పక్షంలో భాగమేనన్న చెప్పారు జైరాం రమేశ్. కూటమిలో అందరు సభ్యులూ ఒకే గళంతో మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు. ఇండియా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయన్న తెలిపారు. ఒకవేళ ఎవరికి వారే విడివిడిగా పోరాడాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలన్నారు. బంగాల్‌లో టీఎంసీ ఇండియా కూటమితోనే పోరాడుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.