Rahul Gandhi Assets : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఆస్తుల విలువ రూ.20.25కోట్ల వరకు ఉంటుందని లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయ భూమి, వాణిజ్య భవనాలు సహా రూ.11 కోట్లకుపైగా స్థిరాస్తులు ఉన్నాయని, రూ.9.25 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. తన సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి రెండోసారి బరిలోకి దిగిన ఆయన, తన నామినేషన్ పత్రాలను బుధవారం సమర్పించారు. 2019 ఎన్నికల్లో ఆస్తుల విలువ రూ.14 కోట్లుగా అఫిడ్‌విట్‌లో తెలిపారు.
అఫిడవిట్ ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ గాంధీ మొత్తం ఆదాయం రూ.1,02,78,680. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ గాంధీ మొత్తం ఆదాయం రూ.1,31,04,970 ఉన్నట్లు పేర్కొన్నారు. రాహుల్ పేరిట రెండు కార్యాలయ స్థలాలు (B-007, B-008) హరియాణాలోని గురుగ్రామ్‌లోని సిలోఖేరా గ్రామంలోని సిగ్నేచర్ టవర్స్‌లో ఉన్నాయి. వీటిని రూ.7 కోట్ల, రూ. 93 లక్షల ధరతో కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఈ స్థలాల ధర రూ.9 కోట్ల వరకు ఉంది. ఈ విధంగా రాహుల్ గాంధీ పేరిట మొత్తం సుమారు రూ.11 కోట్లు విలువైన స్థిరాస్తి ఉందని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎంపీగా వేతనం, అద్దెలు, బ్యాంకు వడ్డీ, బాండ్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు నుంచి ఆదాయం వచ్చినట్టు తెలిపారు.
రాహుల్ గాంధీ అఫిడవిట్‌లోని పేర్కొన్న అంశాలు
చరాస్తులు: సుమారు రూ.9.25 కోట్లు (రూ.9,24,59,264)
స్థిరాస్తి: రూ. 11 కోట్లకుపైగా (రూ.11,15,02,598)
నగదు: రూ. 55 వేలు
బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు: రూ. 26,25,157
మ్యూచవల్ ఫండ్ పెట్టుబడులు: రూ.3,81,33,572( 3.81 కోట్లు)
సావరిన్ గోల్డ్ బాండ్లు: రూ. 1,52,147
ఈక్విటీ షేర్లు: రూ. 4,33,60,519(4.33 కోట్లు )
కేసులు: 18 పెండింగ్ (ఎక్కువగా పరువు నష్టం కేసులు)
యూడీఎఫ్ అభ్యర్థి శశిథరూర్ ఆస్తుల వివరాలు
మరోవైపు, కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ నాలుగోసారి పోటీచేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ.56కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అందులో రూ.49.31 కోట్ల విలువైన చరాస్తులు కాగా, రూ.6.66 విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. దిల్లీ, విదేశాల్లో వివిధ బ్యాంకులలో స్థిర డిపాజిట్లు, పెట్టుబడులు ఉన్నట్లు పేర్కొన్నారు.
మాజీ సీఎం కొడుకు ఆస్తి రూ.700 కోట్లు- 5ఏళ్లలో డీకే ప్రాపర్టీ 75 శాతం జంప్!
రూ.100 కోట్ల జరిమానా వసూల్- 28 కిలోల జయలలిత బంగారు నగలు వేలం