Puri Ratna Bhandar Open : పూరీ జగన్నాథుడి రత్నభాండాగారంలోని మూడో గది ఈ నెల 18న మళ్లీ తెరుచుకోనుంది. 46ఏళ్ల తర్వాత తొలిసారి, ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకు వచ్చేశారు. రహస్య గదిలో గోడకు ఐదు అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. అల్మారాలు, పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని తెలిపారు.
మళ్లీ రహస్య గది ఓపెన్
ఈ క్రమంలో ఈ నెల 18న మళ్లీ ఆ రహస్య గదిని తెరిచి ఆభరణాలను తరలించనున్నారు. వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తారు. గురువారం ఉదయం 9గంటల 51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఆభరణాలన్నిటినీ తరలించాకే పురావస్తుశాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్‌ఐ అధికారులు, రహస్య గది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారని జస్టిస్ రథ్ వివరించారు. ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు. రహస్యగదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తిచేశారు.
తాళం పగలగొట్టి లోపలికి
జులై 14న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రత్నభాండాగారంలోని ఇన్నర్, ఔటర్ ఛాంబర్లను తెరిచారు. ముందుగా ఔటర్ ఛాంబర్‌లో రెండు గదులను తెరిచి అందులోని ఆభరణాలను టేకుతో చేసిన చెక్కపెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించారు. అసలైన మూడో గదిని తెరిచేందుకు యత్నించగా, తొలుత ఏ తాళం చెవితోనూ అది తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో గదికి ఉన్న తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్యగోమేధికాలు భద్రపర్చిన చెక్క పెట్టెలు, అల్మారాలు కనిపించాయి. గదిలో తేమతో పాటు వర్షపు నీరు చిమ్మిన గుర్తులు కనిపించాయి. అప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం ఏమీ పరిశీలించకుండానే వెంటనే బయటకు వచ్చి గది తలుపులకు సీల్ వేశారు. 15న పూరీలో బహుడా యాత్ర ముగియగా, 17న సునా బేషా ఉత్సవం ఉండటం వల్ల 18నే రహస్యగదిని మళ్లీ తెరవాలని నిర్ణయించారు.