How To Make Puri Curry Recipe At Hotel Style : చాలా మంది ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌లో ఒకటి.. పూరీ. కేవలం టిఫెన్‌గా మాత్రమే కాదు పండగల టైమ్‌లో, ఇతర సందర్భాల్లో, తినాలని అనిపించినప్పుడు కొంతమంది పూరీలు ప్రిపేర్ చేసుకొని తింటుంటారు. ఇంకొందరైతే వానాకాలం చినుకులు పడుతున్నప్పుడు పూరీలను(Puri) వేడివేడిగా చికెన్ కర్రీతో ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు వీటిని పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకొని తినాలనుకుంటారు. కానీ, ఎలా చేసుకోవాలో తెలియక పప్పు వంటి కూరలతో అడ్జెస్ట్ అవుతుంటారు. అలాంటి వారికోసం హోటల్ స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా 'పూరీ కర్రీ' రెసిపీ తీసుకొచ్చాం. ఇంతకీ, పూరీ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పూరీ కర్రీకి కావాల్సినవి :
- ఉల్లిపాయలు - 1 కప్పు
- చిన్న బంగాళదుంప - 1
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అరటీస్పూన్
- మినపప్పు - 1 టీస్పూన్
- శనగపప్పు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- పచ్చిమిర్చి - 2(కారం ఉన్నవి)
- పసుపు - పావు టీస్పూన్
- అల్లం తరుగు - 1 టీస్పూన్
- శనగపిండి - 2 టీస్పూన్లు
- కరివేపాకు రెమ్మలు - 2
- నిమ్మరసం - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- వాటర్ - కావాల్సినంత
టిఫెన్ స్పెషల్ : "రాయలసీమ పల్లీ చట్నీ" - పదే పది నిమిషాల్లో రెడీ!
హోటల్ స్టైల్ పూరీ కర్రీ తయారీ విధానం :
- పూరీ కర్రీ కోసం ముందుగా ఉల్లిపాయలను సన్నని పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా పొడవుగా తరుక్కోవాలి. చిన్న బంగాళదుంపను ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. నూనె కాస్త హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ మరికాసేపు వేయించుకోవాలి.
- అవి వేగాక.. ఆ మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పావు టీస్పూన్ పసుపు వేసుకొని హై ఫ్లేమ్ మంట మీద మరో నాలుగు నిమిషాల పాటు అంటే.. ఉల్లిపాయలు కాస్త మెత్తగా మారే వరకు మగ్గించుకోవాలి. అంతేకానీ.. ఆనియన్స్ మరీ మెత్తగా ఉడికించుకోవద్దు.
- అలా ఉడికించుకున్నాక అందులో అరలీటర్ వాటర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆపై కడాయిపై మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద పావుగంట పాటు ఆ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
- అది ఉడుకుతున్న సమయంలో ఒక గ్లాసులో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో 2 టీస్పూన్ల శనగపిండి వేసుకొని దాన్ని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికి కాస్త మెత్తబడ్డాయనుకున్నాక అందులో కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం తరుగు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కర్రీ కాస్త దగ్గర పడేవరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా ఉడికించిపెట్టుకున్న బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కాసేపు మరిగించుకోవాలి. అంటే.. కూర మరీ చిక్కబడే వరకు కాకుండా కాస్త పల్చగా ఉన్నప్పుడే దించుకోవాలి.
- అలా అయ్యిందనుకున్నాక స్టౌ ఆఫ్ చేసి కాస్త నిమ్మరసం యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ!
5 నిమిషాల్లో అద్భుతమైన టమాటా నువ్వుల పచ్చడి - వేడి వేడి అన్నంలో అమృతమే!