Pune Rash Driving Case : మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు టెకీల మృతికి కారణమైన బాలుడి (17) బెయిల్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు బుధవారం రద్దు చేసింది. వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశించింది. దీంతో పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్‌కు రెండు రోజుల కస్టడీ విధించింది సెషన్స్ కోర్టు.
గత ఆదివారం మద్యం మత్తులో కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కేసులో గంటల్లోనే బాలుడికి బెయిల్ మంజూరు కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు వద్దకు వెళ్లి, ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరారు. ఈ ప్రమాదాన్ని అతి క్రూరమైన చర్యగా తెలిపారు. ఈ మేరకు పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలను సవరించింది.
బాలుడిని రిమాండ్‌కు పంపాలని రివ్యూ అప్లికేషన్ దాఖలు తామే చేశామని పుణె పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు. 'మైనర్‌ను మేజర్‌గా పరిగణించి విచారించడానికి రిమాండ్ హోమ్‌కు పంపాలని జువైనల్ జస్టిస్ బోర్డులో రివ్యూ అప్లికేషన్ దాఖలు చేశాం. మా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న బోర్డు 15 రోజుల పాటు రిమాండ్ హోమ్ తరలించింది. కానీ, మేజర్‌గా విచారించేందుకు ఇంకా ఉత్తర్వులు రాలేదు. వాటి కోసమే ఎదురుచూస్తున్నాం' అని కమిషనర్ పేర్కొన్నారు.
-
#WATCH | Maharashtra: On the Pune accident case, Amitesh Kumar, Pune Police Commissioner says "We had filed in a review application before the Juvenile Justice Board to allow the juvenile to be tried as an adult and also to send him in the remand home. The operative order was… pic.twitter.com/BU9YeQuYDl
— ANI (@ANI) May 22, 2024
మైనర్ తండ్రికి రెండు రోజుల కస్టడీ
అయితే బాలుడిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు, మైనర్‌కు వాహనం ఇచ్చినందుకు ఇప్పటికే అతడి తండ్రి విశాల్ అగర్వాల్‌తోపాటు మద్యం సరఫరా చేసినందుకు హోటల్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం బాలుడి తండ్రిని పోలీసులు సెషన్స్ కోర్టుకు తీసుకురాగా, రెండు రోజుల కస్టడీ విధించింది. విశాల్‌ను కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో కొందరు ఇంక్ చల్లి నిరసన తెలిపారు. మరోవైపు ఆ బాలుడికి డ్రైవింగ్ లైసెన్సుపై నిషేధం విధిస్తున్నామని, 25 ఏళ్లు వచ్చేంతవరకు జారీ చేయమని మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వివేక్ భిమన్వార్ వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 10% లోపే- బరిలో కేవలం 797 మందే! - Lok Sabha Elections 2024