Prajwal Revanna Suspend : అభ్యంతరకర వీడియోల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ సస్పెండ్ చేసింది. మహిళలపై లైంగికదాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు బయటకు రావటం వల్ల చర్యలు చేపట్టింది. అభ్యంతరకర వీడియోల వ్యవహారంపై చర్చించేందుకు మంగళవారం ఉదయం సమావేశమైన జేడీఎస్ కోర్ కమిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదిక వచ్చే వరకు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
'బీజేపీ, ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం లేదు'
ప్రజ్వల్ రేవణ్ణకు షోకాజు నోటీసు కూడా జారీ చేసినట్లు కోర్ కమిటీ భేటీ తర్వాత జేడీఎస్ అగ్రనేత, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. సిట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్లు చెప్పారు. ఈ కేసుతో బీజేపీ, ప్రధాని మోదీకి, మాజీ ప్రధాని దేవెగౌడతోపాటు తనకు ఎలాంటి సంబంధం లేదని కుమారస్వామి తేల్చిచెప్పారు.
అంతకుముందు జేడీఎస్ కోర్ కమిటీ అధ్యక్షుడు జీటీ దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. "ప్రజ్వల్ రేవణ్ణపై సిట్‌ను స్వాగతిస్తున్నాం. సిట్ విచారణ పూర్తయ్యే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా పార్టీ జాతీయ అధ్యక్షుడికి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం" అని జీటీ దేవెగౌడ తెలిపారు. ఈ వీడియోలు బయటకు వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించగా ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయారు. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. మూడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కర్ణాటక పోలీసులను ఆదేశించింది.
'ఎందుకు చర్యలు తీసుకోలేదు?'
ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేస్తూ జేడీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. నిందితులపై పూర్తిస్థాయి చట్టాన్ని అమలు చేస్తామని చెప్పింది. మహిళలపై నేరాలను బీజేపీ సహించేది లేదని, కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ప్రభుత్వానికి ఈ కేసు గురించి ఎప్పటి నుంచో తెలిసి ఉంటే నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
'ఈ వీడియోల వెనక ఉన్నది ఎవరు?'
ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసే ముందుకు కుమారస్వామి కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. "ఆ వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అవి అతడివేనన్న ఆధారం ఏంటి? అయినా సరే నైతికత ఆధారంగా చర్యలు ఉంటాయి" అని వ్యాఖ్యానించారు. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైన కూడా దర్యాప్తు సాగాలని తెలిపారు. "అసలు ఈ వీడియోల వెనక ఉన్నది ఎవరు? వారు స్త్రీల పరిరక్షకులా? అలాగే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు" అని అన్నారు. ప్రజ్వల్‌పై అభియోగాలు వాస్తవమని తేలితే చట్టప్రకారం శిక్ష తప్పదని గతంలో కూడా వెల్లడించారు.