Prajwal Revanna Sex Scandal : హాసన్ MP ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ కుంభకోణంలో మరికొందరు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేశారు. వందలమంది మహిళలు, ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి మాజీ మంత్రి HD రేవణ్ణ ఆకృత్యాలకు బలైనా ఇంత వరకు పనిమనిషి తప్ప మరెవరూ ఫిర్యాదు చేయలేదు. కాగా ప్రజ్వల్‌పై అత్యాచార కేసు నమోదైనట్లు సీఎం సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. బాధితులను గుర్తించి, భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజ్వల్ విషయంలో బీజేపీ తప్పు చేసిందనీ, ఆయన గురించి ముందే తెలిసి కూడా టికెట్ ఇచ్చారనీ ఇప్పటికైనా అతడి పాస్‌పోర్టును రద్దు చేసి భారత్‌కు రప్పించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
సొంత పార్టీ నేతనూ వదలని ప్రజ్వల్!
మరోవైపు, బాధితులు తెలిపిన వివరాలు దిగ్భ్రాంతి గొలుపుతున్నాయి. ఓ కేసులో జేడీఎస్ పార్టీ నాయకురాలే ప్రజ్వల్‌కు బలైంది. స్థానిక బాలికలకు వసతిగృహంలో సీట్లు ఇప్పించమని అడిగేందుకు ప్రజ్వల్ అతిథి గృహానికి వెళ్లినప్పుడు, తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపింది. అప్పటికే అక్కడ చాలా మంది మహిళలు ఉన్నారనీ, అందరినీ పంపి తనను గదికి రమ్మని అసభ్యంగా తాకాడని వివరించింది. అభ్యంతరం తెలపగా తుపాకీ తీసి తనను, తన భర్తను చంపేస్తానని భయపెట్టి అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి ఈ విషయం బయట తెలిస్తే వీడియోను విడుదల చేస్తానని బెదిరించాడనీ, మూడేళ్లుగా అదే వీడియోతో భయపెట్టి తనను రేప్ చేశాడని వెల్లడించింది.
'మహిళను కట్టేసి అత్యాచారం'
మరో కేసులో బాధితురాలి కుమారుడు నిందితులపై ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుడు తన తల్లికి సంబంధించిన వైరల్ వీడియోను చూపించాడని పేర్కొన్నాడు. అందులో ఆమెను ప్రజ్వల్ కట్టేసి అత్యాచారం చేసినట్లు ఉందని వివరించాడు. ఇదే క్రమంలో ఏప్రిల్ 30న రేవణ్ణ దగ్గర పనిచేసే సతీశ్ బాబణ్ణ అనే వ్యక్తి వచ్చి తన తల్లిని తీసుకెళ్లాడనీ. ఆమె ఎక్కడ ఉందో ఇప్పటివరకు తెలియరాలేదని వాపోయాడు. HD రేవణ్ణ ఇల్లు, తోటల్లో ఆమె ఆరేళ్లు పని చేసిందనీ మూడేళ్ల క్రితం మానేసి సొంతూరులో కూలికి వెళ్తోందని చెప్పాడు. తన తల్లికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సిద్ధరామయ్యకు రాహుల్ లేఖ
ప్రజ్వల్, హెచ్‌డి రేవణ్ణ ఆకృత్యాలకు బలైన బాధిత మహిళలందరిని అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదంతో ప్రజ్వల్ పూర్తి రక్షణలో ఉన్నట్లు ఆరోపించారు. మహిళలపై దారుణ హింస ఘటనలు వచ్చినప్పుడల్లా మౌనం వహించే మోదీ లాంటి నాయకుడిని తాను ఇంతవరకు చూడలేదన్నారు. ఈ ఘటనను భయంకర లైంగిక హింసగా అభివర్ణించారు. ప్రజ్వల్‌ను సోదరుడు లేదా కొడుకుగా చూసే మహిళలపై ఇలా చేయడం దారుణమన్నారు. ప్రజ్వల్ ఒక సామూహిక రేపిస్ట్ అని సాక్షాత్తూ బీజేపీ నేత దేవెరాజగౌడ చెప్పినా కూడా అమిత్‌షా పట్టించుకోకపోవడం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఇంతటి భయంకర ఆరోపణలు ఉన్నా "సామూహిక రేపిస్ట్" కోసం ప్రధాని మోదీ ప్రచారం చేయడం దిగ్భ్రాంతికరమని వాపోయారు.
ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీస్
మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమైన సిట్ ఆయనకు ఈ వివరాలు తెలిపారు. దీంతో పాటు ప్రజ్వల్ రేవణ్ణకు, అతడి తండ్రి హెచ్‌డి రేవణ్ణకు కొత్త నోటీసులు జారీ చేసింది. సిట్ బృందం ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు.
లోయలో బోల్తా పడ్డ కారు- ఐదుగురు విద్యార్థులు దుర్మరణం - Mussoorie Road Accident