Prajwal Revanna Case : తీవ్ర దుమారం రేపిన హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంలో అనూహ్య మలుపు జరిగింది. ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసుల్లో ఫిర్యాదుదారుగా ఉన్న ఓ మహిళ మాట మార్చారు. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించారని బాధిత మహిళ తెలిపినట్టు జాతీయ మహిళా కమిషన్-NCW వెల్లడించింది. అంతేకాకుండా ప్రజ్వల్‌పై తప్పుడు కేసు పెట్టేలా తనపై ఒత్తిడి చేశారని ఆ మహిళ తెలిపారని చెప్పింది.
మహిళను భయపెట్టారు: కుమారస్వామి
జాతీయ మహిళా కమిషన్ తాజాగా చెప్పిన వివరాలపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి స్పందించారు. ఈ అంశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం-SITను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సిట్ అధికారులు బాధిత మహిళను బెదిరించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాంగ్మూలాలు ఇవ్వకపోతే వ్యభిచారం కేసు నమోదు చేస్తామని సదరు మహిళను భయపెట్టినట్లు కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు.
'మహిళను ఎక్కడ ఉంచారు?'
అయితే కిడ్నాప్‌నకు గురైన మహిళను ఎక్కడ ఉంచారు? ఆమెను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు? అని ప్రశ్నించారు. కుమారస్వామి చేసిన ఆరోపణలపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. జేడీఎస్ నేతలు చేసే అన్ని ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. సిట్ దర్యాప్తు నిర్వహిస్తోందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు.
దర్యాప్తు ముమ్మరం
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హాసన్‌కు చెందిన జేడీఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసును కొన్ని రోజుల క్రితం నమోదు చేశారు. వీటితోపాటు అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించి అభ్యంతరకర ఫొటోలు తీయడం వంటి అభియోగాలు కూడా మోపారు. ప్రస్తుతం ప్రజ్వల్ విదేశాల్లో ఉన్నారు. లైంగిక దౌర్జన్యం వ్యవహారంలో ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న అభియోగాలతో ప్రజ్వల్ తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.