PM Modi Inaugurate ICAE : భారతదేశంలో ఆహార ఉత్పత్తులు సమృద్ధిగా ఉన్నాయని, ఇది ఆహార మిగులు దేశం (ఫుడ్ సర్ప్లస్) అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడు భారత్ ప్రపంచ ఆహార భద్రత కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. భారతదేశం రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. 65 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న 32వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్స్-ICAEను ప్రధాని మోదీ దిల్లీలో ప్రారంభించారు. ఈ సమావేశానికి 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు.
2024-25 కేంద్ర బడ్జెట్ స్థిరమైన వ్యవసాయంపై దృష్టి సారించిందని మోదీ చెప్పారు. గతంలో ICAEకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారతదేశం అప్పుడప్పుడే స్వాతంత్ర్యం సాధించిందని మోదీ గుర్తుచేశారు. ఆ సమయంలో వ్యవసాయం, ఆహార భద్రత పరమైన సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇప్పుడు భారత్ ఆహార మిగులు దేశంగా ఎదిగిందని, పాలు, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని మోదీ చెప్పారు. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ ఉత్పత్తిలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిందని తెలిపారు. గత పదేళ్లలో భారత్ వాతావరణాన్ని తట్టుకునే 1,900 కొత్త వంగడాలను అందించిందని ప్రధాని చెప్పారు. భారతదేశం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వివరించారు. పెట్రోలులో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ పయనిస్తోందని అన్నారు.
"భారతీయ వ్యవసాయంలో మరో ప్రత్యేకత ఉంది. భారత్‌లో మేము ఇప్పుడు కూడా ఆరు సీజన్లను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచించుకుంటాం. మా దేశంలో 15 వ్యవసాయ వాతావరణ ప్రాంతాలు ఉన్నాయి. మీరు భారత్‌లో వంద కిలోమీటర్ల ప్రయాణిస్తే, అక్కడ వ్యవసాయం తీరు మారుతుంది. మైదాన ప్రాంతంలో పంటలు ఒకలా, హిమాలయాల్లో పంటలు మరోలా, ఎడారి ప్రాంతంలో ఒకలా, నీరు తక్కువగా ఉండే చోట ఇంకోలా, కోస్తా ప్రాంతంలో మరోలా వ్యవసాయం ఉంటుంది. ఈ వైవిధ్యత ప్రపంచ ఆరోగ్య భద్రత కోసం భారత్‌ను ఆశాకిరణంలా నిలుపుతోంది" అని ప్రధాని మోదీ అన్నారు.
ఐసీఏఈ సదస్సు ఆగస్టు 7 వరకు దిల్లీలో జరగనుంది. ‘‘సుస్థిర వ్యవసాయ - ఆహార వ్యవస్థల దిశగా పరిణామం’’ అనే థీమ్‌తో ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలను ఈ సందర్భంగా యువ శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు ప్రదర్శించనున్నారు. ఈ సదస్సు ద్వారా వ్యవసాయ పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన పురోగతికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ఐసీఏఈ సదస్సులో ప్రదర్శించనున్నారు.
'గవర్నర్లు కేంద్రం-రాష్ట్రాల మధ్య వారధులుగా ఉండాలి' - ప్రధాని మోదీ - PM Modi Urges Governors