PM Modi Scuba Diving : గుజరాత్‌లో తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ డేరింగ్ స్టంట్ చేశారు. లోతైన సముద్రంలోకి దూకి ద్వారకా నగరం మునిగిపోయిందని భావించే చోట పూజలు చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. డైవింగ్‌కు సంబంధించిన పలు చిత్రాలను జతచేశారు. సాహసోపేతమైన స్టంట్ కోసం స్కూబా గేర్ ధరించిన ప్రధాని పలువురు డైవర్ల సాయంతో లోపలికి వెళ్లారు. నెమలి ఈకలతో వెళ్లి పురాతన ద్వారకా నగరానికి నివాళులర్పించారు.
నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రార్థన చేయడం దివ్యమైన అనుభూతినిచ్చిందని ప్రధాని ఎక్స్‌లో పేర్కొన్నారు. పూరతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందినట్లు చెప్పారు. శ్రీ కృష్ణ భగవానుడు అందరినీ ఆశీర్వదిస్తారని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
"ఎన్నో సంవత్సరాల నుంచి నేను సముద్రంలోని ద్వారకా నగరాన్ని సందర్శించాలని అనుకున్నా. అక్కడకు చేరుకొని ప్రార్థనలు చేయాలనే కోరిక నాకు ఉండేది. ఎట్టకేలకు ఆ కోరిక ఈరోజు నెరవేరింది. సముద్ర గర్భంలోకి వెళ్లే సమయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యాను."
- ప్రధాని మోదీ
ద్వారకా నగరి చరిత్ర
భారత్‌లోని సప్త మోక్షదాయక నగరాల్లో ద్వారక ఒకటిగా సంప్రదాయం చెబుతోంది. పశ్చిమ సముద్రతీరంలో సౌరాష్ట్ర నేటి గుజరాత్‌లో ద్వారకా పట్టణంగా ఉంది. ద్వారకలో నందన, చైత్రరథ, మిశ్రక, వైబ్రాజ అనే నాలుగు ఉద్యానవనాలుండేవి. వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి. జరాసంధుడు అనే రాక్షసుడి దాడుల నుంచి రక్షణ పొందేందుకు సురక్షితమైన ప్రాంతం కావాలన్న శ్రీ కృష్ణుడి కోరికపై విశ్వకర్మ ద్వారకను నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాగా, శతాబ్దాల క్రితం ద్వారకా నగరం శ్రీ కృష్ణుడు భూమి నుంచి నిష్క్రమించిన తర్వాత సముద్రంలో మునిగిపోయిందని హిందువులు విశ్వసిస్తారు.
వర్చువల్‌గా ఏపీ-మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభం
స్కూబా డైవింగ్ అనంతరం అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి వద్ద నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ- ఎయిమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఇదే వేదిక మీద నుంచి మరో నాలుగు ఎయిమ్స్ ఆస్పత్రులను మోదీ జాతికి అంకితం చేశారు. పంజాబ్‌లోని బఠిండా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, బంగాల్ నుంచి కల్యాణి, గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించారు. రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో 23 రాష్ట్రాల్లో నిర్మించనున్న 200 ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
'మూడు నెలలు మన్‌కీబాత్ ఉండదు'
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో క్రీడా, సినీ, సాహిత్య రంగాలతో పాటు ఇన్‌స్టాగ్రామ్, య్యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్‌సర్లు చొరవ చూపాలని కోరారు. యువతను పోలింగ్ బూత్ వైపు వెళ్లేలా ప్రభావితం చేయాలని చెప్పారు. 110వ మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ప్రతి రంగంలో నారీశక్తి కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా రానున్న మూడు నెలలు మన్‌కీబాత్ ఉండదని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.
కశ్మీర్ టు పంజాబ్- డ్రైవర్ లేకుండా 78కి.మీ దూసుకెళ్లిన రైలు- టెన్షన్ టెన్షన్!
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం- ద్వారక గుడికి వెళ్లడం ఇక చాలా ఈజీ!