PM Modi BJP Membership Drive : పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అనుసరించేకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ప్రతిపక్ష పార్టీలను చూస్తే అర్థమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. సభ్యత్వ నమోదు ప్రచారంతో బీజేపీ మరింతగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ కార్యకర్తలు వినుత్నంగా ఆలోచించి కొత్త సభ్యులను చేర్చుకోవడానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని మోదీ సూచించారు. 18-25 ఏళ్ల వయస్సు వారిని లక్ష్యంగా చేసుకోవాలని పార్టీ నేతలకు తెలిపారు. కొత్త తరానికి 10 ఏళ్ల క్రితం జరిగిన స్కామ్‌ల గురించి తెలియవని, వాటిని వివరించాలని చెప్పారు. బీజేపీ, లోక్‌సభలో ఇద్దరు ఎంపీలతో ప్రారంభమై ఈ స్థాయికి చేరుకుందని, దానికి తాము పాటించే నేషన్ పస్ట్ సిద్ధాంతం, ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉండటమే అందుకు కారణమని తెలిపారు. బీజేపీని, అంతకు ముందున్న జనసంఘ్‌ను అప్పట్లో ప్రత్యర్థి పార్టీలు ఎగతాళి చేశాయని తెలిపారు. దేశ రాజకీయ సంస్కృతిని మార్చడానికి బీజేపీ తీవ్ర కృషి చేసిందన్నారు. సభ్యత్వ నమోదు, కుటుంబంలోకి కొత్త సభ్యులను స్వాగతించడం లాంటిదన్నారు. సభ్యత్వ నమోదు పార్టీ సీట్లను పెంచుకోవడం కోసం కాదని, సైద్ధాంతిక, భావోద్వేగ ప్రచారానికి సంబంధించింది అని చెప్పారు.