PM Modi Ayodhya Visit : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో దూసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో పర్యటించారు. రామమందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ. జనవరిలో అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత బాలక్ రామ్‌ను మోదీ దర్శించుకోవడం ఇదే మొదటిసారి. అనంతరం స్థానికంగా నిర్వహించిన భారీ రోడ్‌షోలోనూ మోదీ పాల్గొన్నారు. సుగ్రీవ కోట నుంచి లతా చౌక్ వరకు రెండు కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్‌షో జరిగింది. మోదీ పర్యటన నేపథ్యంలో నగరమంతా ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కటౌట్‌లతో నిండిపోయింది. ఒకవైపు ఆదివారం కావడం, మరోవైపు ప్రధాని రాక నేపథ్యంలో అయోధ్యకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానానికి ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్ జరగనుంది.
ఆ ఆచారాన్ని టీ అమ్మేవాడు తుంగలో తొక్కాడు
అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పాకులాడుతున్నాయన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తమ కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. మోదీ ఉన్నా, లేకున్నా దేశం ఉంటుందని హామీ ఇచ్చారు. తాను దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తీరు ప్రజలు చూస్తున్నారని, నిజాయితీతో సేవలందించడమే తన ధర్మమని చెప్పారు. రాజకుటుంబ వారసుడే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చన్న ఆచారాన్ని ఈ టీ అమ్మేవాడు తుంగలో తొక్కాడని ప్రధాని ఉద్ఝాటించారు.
"పదేళ్ల పదవీకాలం తర్వాత ఇంకోసారి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. మీరందరూ నా కష్టాన్ని చూశారు. నిజాయితీతో మీరందరకీ సేవ చేయడమే నా ధర్మం. మోదీ భారత్ కోసం వచ్చే ఐదేళ్లు కాదు 25 ఏళ్ల కోసం బాటలు వేస్తున్నారు. మోదీ ఉన్నా లేకపోయినా దేశం ఎప్పటికీ ఉంటుంది. ఎస్‌పీ, కాంగ్రెస్‌లు ఏం చేస్తున్నాయి? తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మోదీ ఎవరి కోసం పనిచేస్తున్నారు? నేను ఏదీ వెనుక దాచుకోలేదు. యోగీ కూడా అలాగే ఉంటారు. మోదీ అలాగే ఉంటారు. యోగీ, మోదీ ఎవరి కోసం పనిచేస్తున్నారు. మాకు పిల్లలు లేరు. మీ పిల్లల కోసమే మేం పనిచేస్తున్నాం. రాజకుటుంబ వారసుడే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చన్న ఆచారాన్ని ఈ టీ అమ్మేవాడు తుంగలో తొక్కాడు."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'యువరాజుకు వయనాడ్‌లో ఓడిపోతానని భయం- అందుకే రాయ్‌బరేలీలో పోటీ' - lok sabha elections 2024