Parrot Owner Held Predicted Poll Result : మరికొద్ది రోజుల్లో లోక్ సభ మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. పలు పార్టీల అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో పీఎంకే పార్టీ తరఫున పోటీ చేస్తున్న కడలూర్ ఎంపీ అభ్యర్థి థంకర్ బచ్చన్ గెలుస్తారని చిలక జోస్యం చెప్పిన ఇద్దరు జ్యోతిష్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిలుకలను పంజరంలో బంధించారనే అభియోగాలపై వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కాసేపటి తర్వాత వారిని విడిచిపెట్టినట్లు అటవీ శాఖ అధికారి తెలిపారు.
కాగా, కడలూరు నియోజకవర్గం నుంచి పీఎంకే పార్టీ తరఫున సినీ దర్శకుడు థంకర్ బచ్చన్ బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆయన జ్యోతిష్యులను సంప్రదించగా లోక్ సభ ఎన్నికల్లో బచ్చన్ గెలుస్తారని జ్యోతిష్య సోదరులు చెప్పారు. జ్యోతిష్యులు తమ దగ్గర ఉన్న నాలుగు చిలుకలలో ఒకదానితో కార్డును తీయించి జోస్యం చెప్పారు. జ్యోతిష్యులను బచ్చన్ సంప్రదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బచ్చన్ ఓ చిలుకకు ఆహారం ఇవ్వమని జ్యోతిష్యుడిని అభ్యర్థించడం దానికి అతడు అరటి పండు అందించడం వంటివి అందులో ఉన్నాయి. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి చేరింది. దీంతో వారు జ్యోతిష్యులపై చర్యలకు దిగారు. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందున రెండు బోనుల్లో ఉంచిన నాలుగు చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. జ్యోతిష్య సోదరులను అరెస్ట్ చేసి మళ్లీ విడిచిపెట్టారు.
బచ్చన్ ఎన్నికల ప్రచారంలో కడలూర్ సమీపంలోని తెన్నంపాక్కంలోని అళగు ముత్తు అయ్యనార్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న జ్యోతిష్యుల వద్ద తన ఎన్నికల అదృష్టాన్ని తెలుసుకోవడానికి చిలుక జోస్యాన్ని కోరారు. జ్యోతిష్కులలో ఒకరు చిలుకను పంజరం నుంచి విడిచిపెట్టి కార్డును తీయించారు. ఆ చిలుక అళగు ముత్తు అయ్యనార్ ఆలయ ప్రధాన దేవత చిత్రం ఉన్న కార్డును తీసింది. అప్పుడు జ్యోతిష్యుడు శుభ సంకేతమని వ్యాఖ్యానించాడు. బచ్చన్ లోక్ సభ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తాడని చెప్పాడు. మరోవైపు, తమ పార్టీ కడలూర్ అభ్యర్థి గెలుస్తాడని జోస్యం చెప్పిన ఇద్దరిని అరెస్ట్ చేయడంపై పీఎంకే అగ్రనేత డాక్టర్ అన్బుమణి రామదాస్ ఖండించారు.
అగ్రనేతల భవితవ్యాన్ని తేల్చే రెండో దశ- ఎన్నికల బరిలో 1210 మంది - 2024 Lok Sabha elections phase 2
తొలి విడత ఎన్నికల్లో 135 మంది మహిళలు పోటీ- కేవలం 8 శాతమే - Women In LS Polls 2024 1st Phase