Kid Chewed Snake : బిహార్‌కు చెందిన ఓ ఏడాది బాలుడు మూడు అడుగుల పామును బొమ్మ అనుకుని చక్కగా ఆడుకున్నాడు. అదే సమయంలో పామును మధ్య భాగంలో కొరికి నమిలాడు. అది చూసిన తల్లి ఒక్కసారిగా భయపడి పిల్లవాడిని తీసుకుని ఆస్పత్రికి పరుగు తీసింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. అయితే పాము మాత్రం చనిపోయింది.
జిల్లాలోని ఫుతేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముహర్ గ్రామానికి చెందిన బాలుడు తన ఇంటి ఆవరణలో ఆడుకున్నాడు. చిన్నారి తల్లి ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఆ సమయంలో తన వద్దకు వచ్చిన పామును ఆటబొమ్మ అనుకున్నాడు. దీంతో ఆ పాముతో ఆడుకున్నాడు. పిల్లలకు బొమ్మలను నోటిలో పెట్టుకోవడం అలవాటేగా! ఆ పిల్లవాడు కూడా పామును ఒక్కసారిగా కొరికి నమిలాడు. అదే సమయంలో అటు వచ్చిన తల్లి ఒక్కసారిగా భయాందోళనకు గురైంది.
చిన్నారి నోటిలో నుంచి పాము బయటకు తీసి కిందపడేసింది తల్లి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేశారు. బాలుడు సురక్షితంగానే ఉన్నట్లు తల్లికి తెలిపారు. అయితే పిల్లవాడు నమిలిన పాము విషపూరితమైనది కాదని వైద్యులు చెప్పారు. అందుకే చిన్నారి ప్రాణానికి ఎలాంటి అపాయం కలగలేదని వెల్లడించారు. దీంతో పిల్లవాడి కుటుంబసభ్యులు అంతా ఊపిరి పీల్చుకున్నారు!
అయితే చిన్నారి పామును నమిలిన విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున గ్రామస్థులు బాలుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. పామును చూసి ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు భయపడిపోతున్నారు. పాము విషపూరితం కాకపోవడం వల్ల పర్లేదని, లేకుంటే పెద్ద విషాదానికి దారితీసేదని వాపోతున్నారు. అది తేలియా జాతికి చెందిన పాముగా చెబుతున్నారు. వానపాములా అనిపిస్తుందని అంటున్నారు.
కొన్నిరోజుల క్రితం తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలోని వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో ఓ నాగుపాము కలకలం సృష్టించింది. 8వ తరగతి చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి స్కూల్ బూటులోకి దూరింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. చివరకు ఏమైందో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.