Jammu Kashmir Next CM : జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఎన్సీ-కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి ఒమర్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేశారు.
'పదేళ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును తెలియజేశారు. 2019 ఆగస్టు 15న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం (ఆర్టికల్ 370 రద్దు) తమకు ఆమోదయోగ్యం కాదని జమ్ముకశ్మీర్ ప్రజలకు తమ తీర్పుతో నిరూపించారు. ఈ ఎన్నికల్లో పాల్గొని ఓట్లు వేసిన అందరికి నా కృతజ్ఞతలు. మేము నిరుద్యోగాన్ని అంతం చేయాలి. ద్రవ్యోల్బణం, డ్రగ్స్ వంటి సమస్యలను పరిష్కరించాలి. ఇప్పుడు ఎల్జీ, ఆయన సలహాదారులు ఉండరు. కేవలం ప్రజల కోసం పనిచేసే 90 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుంది' అని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్‌లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఎన్సీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి, ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయకుండానే ఎన్నికల ప్రచారం సాగించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తేలిన నేపథ్యంలో ఒమర్ ముఖ్యమంత్రి అవుతారని ఫరూక్ అబ్దుల్లా అధికారిక ప్రకటన చేశారు.
#WATCH | Srinagar, J&K | National Conference chief Farooq Abdullah says, " after 10 years the people have given their mandate to us. we pray to allah that we meet their expectations...it will not be 'police raj' here but 'logon ka raj' here. we will try to bring out the innocent… pic.twitter.com/j4uYowTij4
— ANI (@ANI) October 8, 2024
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఒమర్- ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. బద్గాం నియోజకవర్గం నుంచి పీడీపీ అభ్యర్థి అగా సయద్ ముంతజీర్ మెహ్దీపై 18వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట అయిన గందర్బల్ స్థానం నుంచి కూడా పోటీ చేసిన ఒమర్- అక్కడ కూడా గెలిచారు.
జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటికి భిన్నంగా ఫలితాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది.