Odisha Army Officer Case : గత వారం ఆర్మీ అధికారికి కాబోయే భార్యతో పోలీసులు ప్రవర్తించిన తీరు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం ఓ సైనికాధికారి, ఆయనకు కాబోయే భార్య కలిసి ఠాణాలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఆ కేసులో బెయిల్‌పై విడుదలైన మహిళ తాజాగా పోలీసులపై లైంగిక దాడి ఆరోపణలు చేశారు. ఆ రోజు ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.
సెప్టెంబర్ 15న తన రెస్టారెంట్‌ను మూసి కాబోయే భర్తతో కలిసి ఇంటికి వెళ్తుండగా, కొందరు ఆకతాయిలు తమతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధిత మహిళ చెప్పారు. వారిపై ఫిర్యాదు చేయడానికి భరత్‌పుర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్ తమ ఫిర్యాదు తీసుకోపోగా తమను దూషించినట్లు వెల్లడించారు. కొంత సమయానికి మరికొందరు పోలీసులు స్టేషన్‌కు రాగా, వారికి తమ సమస్య చెప్పే క్రమంలో ఏమైందో తెలియదు కాని తనకు తోడుగా ఉన్న ఆర్మీ అధికారిని లాకప్‌లో వేశారన్నారు. సైనిక అధికారిని అన్యాయంగా లాకప్‌లో పెట్టడం చట్టవిరుద్ధమని వారితో వాదించడం వల్ల ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు తనపై భౌతిక దాడి చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు.
వారిని ఎదుర్కొనే క్రమంలో ఒక పోలీసు చేతిని కొరికినట్లు ఆమె వెల్లడించారు. ఫలితంగా తనపై కేసు నమోదు చేసి కాళ్లు, చేతులు కట్టేసి ఓ గదిలో పడేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఒక పోలీసు అధికారి గదిలోకి వచ్చి తన ఛాతీపై పలుమార్లు తన్ని లైంగికంగా వేధించినట్లు బాధిత మహిళ వాపోయారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఎయిమ్స్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఆమె గురువారం విడుదలయ్యారు.
భువనేశ్వర్‌లో జరిగిన ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ రాష్ట్ర డీజీపీని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మహిళా పోలీసులు, మరో ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, ఆ వార్త దిగ్భ్రాంతికి గురిచేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై న్యాయస్థానం పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటన బీజేపీ అసమర్థ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని మండిపడ్డారు.
'వారందరికీ ఇదే వార్నింగ్- 2026 మార్చి 31తో దేశంలో నక్సలిజం మాయం!' - Amit Shah on Naxalism