Nitin Gadkari Nagpur : మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి గెలవాలని పట్టుదలగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ నాగ్‌పుర్‌లో 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆయన, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ఆధిక్యంతో హ్యాట్రిక్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
75 శాతానికి పైగా ఓట్లు గ్యారెంటీ!
ఈసారి ఎన్నికల్లో దాదాపు 75 శాతానికి పైగా ఓట్లను తాను దక్కించుకుంటానని గడ్కరీ ధీమాగా చెబుతున్నారు. తమ కంచుకోటైన నాగపుర్‌లో గత రెండు పర్యాయాల్లో ఖంగుతిన్న కాంగ్రెస్ ఈసారి సత్తాచాటాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా వ్యూహాలను రచిస్తోంది. తమ పార్టీ తరఫున స్థానికుడైన వికాస్ ఠాక్రేను బరిలో నిలిపింది. విజయం కోసం గడ్కరీ శ్రమించక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తొలిదశలో భాగంగా నాగపుర్‌లో ఏప్రిల్ 19న జరగనుంది.
ఇరు పార్టీలు కూడా!
విదర్భ ప్రాంతంలో అతిపెద్ద నగరం నాగపుర్. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇక్కడే బౌద్ధమతాన్ని స్వీకరించారు. బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-RSSకు నాగ్‌పుర్‌తో బలమైన బంధం ఉంది. ఈ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నాలుగు బీజేపీ ఖాతాలో ఉండగా, రెండు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది మహారాష్ర్టలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం వల్ల ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని ఇరుపార్టీలు చూస్తున్నాయి.
ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా!
నాగపుర్ లోక్‌సభ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఇప్పటివరకు 17 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరగ్గా 13 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది. గత రెండు ఎన్నికల్లో బీజేపీనే విజయఢంకా మోగించింది. గత రెండు దఫాలు నితిన్ గడ్కరీ ఇక్కణ్నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నాగపుర్‌లో 1996లో తొలిసారి గెలిచిన బీజేపీ దాదాపు 18 ఏళ్ల తర్వాత 2014లో విజయం సాధించింది. 2014లో ఏడుసార్లు ఎంపీ, కాంగ్రెస్ నేత విలాస్ ముత్తేవార్‌ను 2 లక్షల 84 వేల ఓట్ల తేడాతో ఓడించిన గడ్కరీ, 2019లో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలెపై రెండు లక్షల 16 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని నితిన్ గడ్కరీ భావిస్తున్నారు.
అభివృద్ధి కలిసొచ్చేనా?
ఆరెస్సెస్‌కు అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరిగా నితిన్ గడ్కరీకి పేరుంది. ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీని చాలామంది చూస్తుంటారు. ముక్కుసూటిగామాట్లాడేతత్వం కలిగిన నితిన్ గడ్కరీ నాగ్‌పుర్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను తీసుకొచ్చారు. ఇవి ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చే అంశాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐదు లక్షల మెజారిటీ పక్కా!
గత పదేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసిన కృషే తనను మళ్లీ గెలిపిస్తుందని గడ్కరీ ధీమాగా ఉన్నారు. తాను ఎవరి దగ్గరికీ వెళ్లి ఓట్లు అడగనని అయినా అయిదు లక్షల మెజారిటీ విజయం సాధిస్తానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. మౌలిక వసతుల ప్రాజెక్టులు బాగానే ఉన్నా నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం వంటివి గడ్కరీకి కొంత ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి.
గడ్కరీ శ్రమించక తప్పదు!
నియోజకవర్గంలో దళిత, కున్బి, హల్బ, ముస్లిం వర్గాల ఓటర్లు దాదాపు 12 లక్షల వరకూ ఉన్నారు. వారి మద్దతును దక్కించుకోవడం ఆయనకు చాలా కీలకమని అంటున్నారు. అటు కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతిస్తోంది. స్థానిక సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ప్రధాన అస్ర్తలుగా చేసుకొని కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రే ప్రచారం చేస్తున్నారు. వికాస్ ఠాక్రే స్థానికుడు కావడం వల్ల విజయం కోసం గడ్కరీ శ్రమించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">