NITI Aayog Meeting Mamata : దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్ ఆఫ్ చేశారని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మమత చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవని తెలిపింది. మమతా బెనర్జీ మాట్లాడేందుకు తగిన మాట్లాడే అవకాశం ఇచ్చారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో తెలిపింది. 'అక్షర క్రమంలో వెళ్తే మమతా బెనర్జీకి మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రమే మాట్లాడే అవకాశం దక్కేది. అయితే సీఎం నుంచి అధికారిక అభ్యర్థన మేరకు ఆమెకు ఏడో స్పీకర్‌గా మాట్లాడే అవకాశం ఇచ్చారు' అని పేర్కొంది.
'ఆ ఆరోపణలు పూర్తిగా అబద్దం'
అలాగే నీతి ఆయోగ్ మీటింగ్‌లో మైక్ ఆఫ్ చేశారని మమత చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సమావేశానికి హాజరైన ప్రతి ముఖ్యమంత్రికి మాట్లాడటానికి తగిన సమయం కేటాయించామని వెల్లడించారు. "నీతి ఆయోగ్ సమావేశానికి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. సమావేశంలో ఉన్నవారంతా ఆమె మాటలను విన్నాం. సమావేశానికి హాజరైన ప్రతి సీఎంకు నిర్ణీత సమయం కేటాయించాం. ప్రతి టేబుల్ ముందు ఉన్న స్క్రీన్‌పై వారికి కేటాయించిన టైమ్ ఉంది. తన మైక్‌ను ఆఫ్ చేశారని మీడియాతో మమత అన్నారు. అది పూర్తిగా అబద్ధం. మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం." అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్ఐతో తెలిపారు.
దీదీ ప్రీప్లాన్ వాకౌట్ : బీజేపీ
నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని బీజేపీ ఆరోపించింది. హెడ్ లైన్స్‌లో నిలవడం కోసమే మమత ఇలా చేశారని విమర్శించింది. 'దేశంలో హెడ్ లైన్స్‌లో నిలవడం చాలా సులభం. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రిని తానే అని దీదీ చెప్తారు. మళ్లీ అదే సమావేశం నుంచి వాకౌట్ చేసి మైక్ ఆఫ్ చేశారు అందుకు మీటింగ్‌ను బహిష్కరిస్తున్నా అని చెప్తారు' అని బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ ఆరోపించారు.
'వారి నిర్ణయం సమర్థనీయమే'
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని బహిష్కరించాలని పలువురు ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా సమర్థించారు. ఈ నిర్ణయానికి కేంద్రం తీసుకున్న చర్యలే కారణమని ఆరోపించారు. "రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సమానంగా చూడాలి. పన్నులు, నిధుల్లో సరైన వాటా ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఫెడరలిజం అర్థం కావడం లేదు" అని విమర్శించారు.
మమత ఆరోపణలపై అధీర్ కౌంటర్
నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్‌ను ఆఫ్ చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ స్పందించారు. 'నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి మమతా బెనర్జీ చెబుతున్న విషయాలు అబద్ధాలని భావిస్తున్నాను. సమావేశంలో ఒక సీఎం మైక్‌ను కట్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో మమతా బెనర్జీకి తెలుసు. మమత దగ్గర స్క్రిప్ట్ ఉంది' అని ఆరోపించారు,
'మైక్ కట్ చేశారు'
నీతి ఆయోగ్ సమావేశంలో తనకు మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆరోపిస్తూ మమతా బెనర్జీ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. తనకు మాట్లాడటానికి ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించారని, ఎన్డీఏ కూటమిలోని నాయకులకు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు మాత్రం ఎక్కువ సమయం ఇచ్చారని ఆరోపించారు. విపక్ష పార్టీల నుంచి తానొక్కదాన్ని మాత్రమే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యాయని పేర్కొన్నారు. తనను మాట్లాడనివ్వకుండా అవమానించారని విమర్శించారు.
VIDEO | " i have come out boycotting the meeting. chandrababu naidu was given 20 minutes to speak, cms of assam, goa, chhattisgarh spoke for 10-12 minutes. i was stopped from speaking after just five minutes. this is unfair. from the opposition side, only i am representing here,… pic.twitter.com/ur9hN1RsUA
— Press Trust of India (@PTI_News) July 27, 2024
పాకిస్థాన్ ఆర్మీ చొరబాటు యత్నం భగ్నం- ఉగ్రవాది హతం- జవాన్ వీరమరణం
ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ! జెలెన్స్కీతో వ్యూహాత్మక చర్చలు!