NDA Meet Narendra Modi Speech : ఎన్డీఏ 3.0 ప్రభుత్వంలో తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 'నేషన్ ఫస్ట్' అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఆర్గానిక్ కూటమి ఎన్డీఏ అని అభివర్ణించారు. రాబోయే పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సుపరిపాలన, అభివృద్ధి నాణ్యమైన జీవితం అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. అలాగే పౌరుల జీవితాల్లో జోక్యాన్ని తక్కువ చేస్తామని చెప్పారు.
దేశ చరిత్రలో ఎన్డీఏనే అత్యంత విజయవంతమైన కూటమి అని మోదీ అన్నారు. విజయవంతంగా మూడు పర్యాయాలు పూర్తి చేసుకుని నాలుగో పర్యాయంలోకి అడుగుపెడుతుందని తెలిపారు. ఎన్డీఏ అధికారం ఏకమైన కూటమి కాదని, నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉందని అన్నారు. దిల్లీలోని పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రసంగించారు.
'ఫలితాల తర్వాత నోరు మూశారు!'
ఈవీఎంల విశ్వసనీయత, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన వారు లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత నోరు మూశారని, ఇదే ప్రజాస్వామ్యం బలం అని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా కూటమి వారు ఈవీఎం, ఆధార్ వంటి సాంకేతిక పురోగతిని ప్రశ్నించినప్పుడే, వారు మునుపటి శతాబ్దానికి చెందిన వారని అర్థమైందని ఎద్దేవా చేశారు. 2024 లోక్‌సభ ఫలితాలు ఎన్డీయే కూటమికి గ్రాండ్ విక్టరీగా తాను భావిస్తున్నట్లు, కానీ 'ఇండియా' తమ విజయాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించిందని చెప్పారు. ఈ ఫలితాల ద్వారా తాము నష్టపోయినట్లు ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించిందని, కానీ తాము ఎన్నటికీ ఓడిపోమని దేశ ప్రజలకు తెలుసునన్నారు మోదీ.
మోదీ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు :
- పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ 100 మార్క్‌ను(ఎంపీ సీట్లు) తాకలేకపోయింది. గత మూడో ఎన్నికల్లో వారి మొత్తం, ఈ ఒక్కసారి మేము గెలిచిన సీట్లకంటే తక్కువ.
- మా పదేళ్ల పాలన కేవలం ట్రైలర్ మాత్రమే. దేశ అభివృద్ధి కోసం మేం కష్టపడి, వేగంగా పని చేస్తాం. అది దేశ ప్రజలందరికీ తెలుసు.
- నాకు ఎన్డీఏ అంటే న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా.
- పొత్తులు కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే అని ఇప్పటికే ఇండియా కూటమి పార్టీలు చెబుతున్నాయి. అది వారి స్వభావం, అధికార దాహానికి నిదర్శనం.
'దక్షిణాదిలో బలం పెరిగింది'
"దక్షిణాది ప్రజలు ఎన్డీయేను ఆదరించారు. కర్ణాటక, తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లోని ప్రజలు భాజపాకు అండగా నిలిచారు. తమిళనాడులో సీట్లు గెలవలేకపోయినా ఓట్లు పెరిగాయి. కేరళలోనూ మా కార్యకర్తలు ఎన్నో బలిదానాలు చేశారు. తొలిసారి అక్కడి నుంచి మా ప్రతినిధి సభలో అడుగుపెడుతున్నారు. అరుణాచల్, సిక్కింలో క్లీన్‌స్వీప్ చేశాం. ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. చంద్రబాబుతో కలిసి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలను అద్దం పట్టింది" అని మోదీ కొనియాడారు.