MP Candidate Stay Away From Home In Balaghat : రాజకీయాల్లో ఒకే ఇంటి నుంచి ఎందరు ప్రజాప్రతినిధులున్నా అందరూ ఒకే పార్టీలో ఉండాలని లేదు. ఏ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే వారు ఆ పార్టీలో చేరుతారు!అయితే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఏకంగా భార్యాభర్తలనే విడదీసింది రాజకీయం! పూర్తి విడిపోకపోయినా ఎన్నికలు ముగిసే వరకు దూరంగా ఉంటున్నారు. అందుకు కారణమేమింటంటే?
ఆమె కాంగ్రెస్- ఈయన బీఎస్పీ
కంకర్ ముంజారే, అనుభా ముంజరే భార్యాభర్తలు. భార్య అనుభ గతేడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గౌరీశంకర్ బైసన్‌పై విజయం సాధించారు. అనుభ భర్త కంకర్ ముంజారే ఓ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కూడా. ప్రస్తుతం ఈయన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కంకర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్‌కు కొన్నిరోజుల ముందే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఒకే ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇంటిని వీడి బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఆయన జిల్లాలోని ఓ డ్యామ్ సమీపంలో పూరిగుడిసెను ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. ఇక్కడి నుంచే తన ప్రచార కార్యక్రమాలను చక్కబెడుతున్నారు.
'మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటారు'
ఎన్నికల వేళ రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు ఒకేచోట అదీ ఒకే ఇంట్లో ఉండటం సమంజసం కాదని భావించారు కంకర్ ముంజరే. ఇందులో భాగంగానే శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లుగా వెల్లడించారు. ఇలా ఒకే ఇంట్లో ఉండటం వల్ల ఓటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ అనుకునే ప్రమాదం ఉందని, అందుకే ఎన్నికల ముగిసే వరకు తాను వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక ఏప్రిల్ 19న పోలింగ్ ముగిసిన రోజే మళ్లీ తిరిగి ఇంటికెళ్తానని చెప్పారు.
భార్య రియాక్షన్
భర్త కంకర్ ముంజరే నిర్ణయం బాధాకరమని అసంతృప్తి వ్యక్తంచేశారు ఎమ్మెల్యే అనుభ. ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తనకు నచ్చలేదన్నారు. 33 ఏళ్లుగా తాము సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతూ వచ్చామని చెప్పారు. కంకర్ గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థిగా పరస్వాడా నుంచి పోటీ చేసినప్పుడు తాను బాలాఘాట్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశానని గుర్తుచేశారు.
ఇక ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారని అడగ్గా తాను మొదటి నుంచి కాంగ్రెస్ మద్దతుదారునని, లోక్‌సభ ఎన్నికల్లో బాలాఘాట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి సామ్రాట్ సారస్వత్ గెలుపునకే కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రచార సమయంలో మాత్రం భర్త గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడనని అన్నారు.
'వాళ్లది కమీషన్- మాది మిషన్'- ఇండియా కూటమిపై మోదీ ఫైర్ - PM Narendra Modi on Congress
పవార్ ఫ్యామిలీలో 'పవర్' పాలిటిక్స్- పోటీకి వదినా-మరదళ్లు 'సై' - Supriya Sule vs Sunetra Pawar