Modi On Ramoji Rao Demise : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (88) అస్తమయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సంతాపం ప్రకటించారు. ఆయన మరణం మీడియా, సినిమా రంగానికి తీరని లోటు అని రాష్ట్రపతి అన్నారు. ఆయన ఈనాడు, ఈటీవీ, ఫిల్మ్ సిటీ సంస్థలను నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. సమాజ హితానికి రామోజీరావు చేసిన కృషికి పద్మ విభూషణ్ వరించిందని పేర్కొన్నారు. ఆయన సేవలు మరువలేనివని చెప్పారు. రామోజీ రావు కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పాత్రికేయ, సినీరంగంపై చెరగని ముద్ర : మోదీ
పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ట్వీట్ చేశారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని తెలిపారు.
"మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు. ఆయనతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కింది. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. రామోజీరావు అసంఖ్యాక అభిమానులకు నా సానుభూతి" అని మోదీ పోస్ట్ చేశారు.
రాజ్‌నాథ్ సింగ్ సంతాపం
రామోజీరావు అస్తమయంపై బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. "మీడియా, చలనచిత్రాల రంగాల్లో తనదైన ముద్ర వేశారు. రామోజీరావు మృతి మీడియా, సినీరంగానికి తీరని లోటు. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు.
దూరదృష్టి గల వ్యక్తి రామోజీరావు : మల్లికార్జున ఖర్గే
"ప్రముఖ సినీ నిర్మాత, మీడియా సంస్థల అధినేత, విద్యావేత్త రామోజీరావు మరణం విచారకరం. మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దూరదృష్టి గల వ్యక్తి ఆయన. సినిమా, పాత్రికేయ రంగానికి విశేష కృషి చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలియజేశారు.
మిజోరాం గవర్నర్ దిగ్భ్రాంతి
రామోజీరావు అస్తమయంపై మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి రామోజీరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సమష్ఠి శక్తికి రామోజీరావు నిదర్శనం అని అన్నారు.
తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి : మమతాబెనర్జీ
"తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి. రామోజీరావు నన్ను ఒకసారి ఫిల్మ్‌సిటీకి ఆహ్వానించారు. ఫిల్మ్‌సిటీ సందర్శన మధురానుభూతి నాకు ఇంకా గుర్తుంది. రామోజీరావు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" బంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంతాపం తెలియజేశారు.
రాహుల్ గాంధీ సంతాపం
రామోజీరావు అస్తమయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ మీడియా పరిశ్రమలో అగ్రగామిగా నిలిచిన పద్మవిభూషణ్, రామోజీరావు అని అన్నారు. జర్నలిజం, సినిమా, వినోదానికి ఆయన చేసిన కృషి మీడియా ల్యాండ్‌స్కేప్‌ను మార్చిందని చెప్పారు. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, స్నేహితులు, అనుచరులతో ఉన్నాయన్నారు.
యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి
రామోజీరావు మరణం పట్ల ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. " రామోజీ గ్రూప్ వ్యవస్థాపకుడు రామోజీరావు మరణం బాధకు గురిచేసింది. రామోజీ గ్రూప్ ద్వారా మీడియా, చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సహకారం చెరగని ముద్ర వేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ పెద్ద నష్టాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు శ్రీరాముడు వారికి ప్రసాదించుగాక. ఓం శాంతి." అని ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు.
బిహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మంజీ సంతాపం
రామోజీరావు మరణం పట్ల బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజీ సంతాపం వ్యక్తం చేశారు. " న్యూస్ ఛానెల్లో పల్లెటూరి వార్తలకు స్పేస్ ఇవ్వాలనే కలను నెరవేర్చిన పద్మవిభూషనుడు రామోజీ రావు. ఆయన మరణ వార్త విని నేను చాలా బాధపడ్డాను. మీడియా రంగంలో ఆయన చేసిన ప్రయోగాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి." అని కొనియాడారు.