ETV Bharat / bharat

కాంగ్రెస్​ యువరాజును ప్రధానిని చేయాలని పాక్ తహతహ : మోదీ - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 2:33 PM IST

Etv Bharat
Etv Bharat

Modi On Pakistan : కాంగ్రెస్‌ యువరాజును భారత ప్రధానిగా చేయాలని పాకిస్థాన్​ తహతహలాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. భారత్‌లో బలహీన సర్కారు ఉండాలని శత్రు దేశాలు కోరుకుంటున్నాయని చెప్పారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం 'ఓట్ జిహాద్'‌కు పిలుపునివ్వడంపై మోదీ మండిపడ్డారు.

Modi On Pakistan : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ యువరాజును భారత ప్రధానిగా చేయాలని దాయాది దేశం పాకిస్థాన్​ తహతహలాడుతోందని ఆరోపించారు. ఇందుకోసం పాక్ నేతలు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాక్‌కు అభిమాని అనే విషయం అందరికీ తెలుసని, ఆ రెండింటి మధ్యనున్న భాగస్వామ్యం ఇప్పుడు బయటపడిందని ప్రధాని ఆరోపించారు.

రాహుల్ గాంధీకి అనుకూలంగా ఇటీవల పలువురు పాక్ నేతలు పెట్టిన సోషల్ మీడియా పోస్టులను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆనంద్, ఖేడా లోక్‌సభ స్థానాల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా సెంట్రల్ గుజరాత్‌లోని ఆనంద్​లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. "భారత్‌లో బలహీన సర్కారు ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారు. 26/11 ముంబయి దాడుల నాటి ప్రభుత్వం, 2014కు ముందున్న సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలని వాళ్లు ఆశపడుతున్నారు" అని మోదీ ఆరోపించారు.

ఓట్ జిహాద్ అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే!
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం ఓట్ జిహాద్‌కు పిలుపునివ్వడంపై మోదీ మండిపడ్డారు. "మనం ఇప్పటివరకు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ గురించి విన్నాం. ఇప్పుడు ఇండి కూటమి నేతలు ఓట్ జిహాద్ గురించి చెబుతున్నారు. ఓట్ జిహాద్ గురించి చెబుతోంది మదర్సాలో చదువుకున్న వారు కాదు. బాగా చదువుకున్న ముస్లిం కుటుంబానికి చెందిన మహిళ ఈ వ్యాఖ్యలు చేశారు. జిహాద్ అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు. ఈ విధమైన వ్యాఖ్యలు చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. దీన్ని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఖండించలేదే?" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు కట్టబెట్టేందు కోసం రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ విధమైన రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వబోమని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని మోదీ డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.