Modi Election Campaign In South India 2024 : లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం మార్చి 17 నుంచి 19 వరకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
బీజేపీ దక్షిణాదిలో పాగా వేస్తుందా?
దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉంటే, దక్షిణాదిలోని 130 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే దక్షిణ భారతదేశంలో తెలంగాణా, కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. కానీ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370, దాని నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400కు పైగా స్థానాల్లో విజయం సాధించాలని కమల దళం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకే దక్షిణాది ఓటర్లను ఆకట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది.
అసలు గెలిచే అవకాశం ఉందా?
బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే కర్ణాటకలోని 28 సీట్లలో 25 సీట్లు, తెలంగాణలో 17 సీట్లలో 4 సీట్లు కైవసం చేసుకుంది. అయితే ఈ తాజా ఎన్నికల్లో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పలు పార్టీలతో పొత్తులు ఏర్పాటు చేసుకుంది. అలాగే మిగతా రాష్ట్రాల్లోని ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు కూడా ప్రయత్నిస్తోంది.
మోదీ దూకుడు
ప్రధాని మోదీ ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఇలా మోదీ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
సుడిగాలి పర్యటనలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒక్క రోజు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి విజయావకాశాలు ఉన్న, ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల మీదుగా ఈ ప్రచార వ్యూహాన్ని రూపొందించినట్లు సమాచారం.
మార్చి 17 నుంచి 19 వరకు
ప్రధాని మోదీ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, కర్ణాటకలోని గుల్బర్గాల్లో శనివారం ప్రచారం చేయనున్నారు. గుల్బర్గా ప్రాంతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కంచుకోటగా ఉంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూశారు. కనుక ఈసారి కూడా దానిని రిపీట్ చేయించాలని మోదీ ఆశిస్తున్నారు.
- మార్చి 17వ తేదీన (ఆదివారం) ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అందులో ప్రధాని మోదీ పాల్గొంటారు. రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి.
- మార్చి 18న తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహిస్తారు. దీనికి స్టాలిన్ ప్రభుత్వం తొలుత అనుమతులు ఇవ్వలేదు. దీనితో బీజేపీ పార్టీ శ్రేణులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి షరతులతో రోడ్‌షోకు అనుమతి పొందాయి. అయితే అదే రోజు తెలంగాణలోని జగిత్యాల, కర్ణాటకలోని శివమొగ్గలోనూ మోదీ ర్యాలీలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ప్రధాని మోదీ మార్చి 19న కేరళలోని పాలక్కడ్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. అదే రోజు తమిళనాడు సేలంలో బహిరంగ సభలో పాల్గొంటారు.
నేడే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్- ఏపీ సహా రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్
ఎన్నికల కోడ్ కథ తెలుసా? ఎప్పుడు ప్రవేశపెట్టారు? అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది?