MH 60R Seahawk Helicopter Indian Navy : సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులను నాశనం చేసేందుకు ఇండియన్ నేవీ సిద్ధమైంది. అందుకోసం MH 60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లను రంగంలోకి దించనుంది. ఈ హెలికాప్టర్లు మరికొద్ది రోజుల్లో భారత నౌకాదళంలో భాగం కానున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేవీల్లో ఒకటిగా పేరొందిన భారత నౌకాదళం MH60R సీహాక్ రాకతో మరింత పటిష్ఠం కానుంది.
ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికా నుంచి భారత్ 24 MH 60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. మొదటి దశలో ఆరు హెలికాప్టర్లు దక్షిణ నౌకాదళంలో చేరుతాయి. 2020 ఫిబ్రవరిలో భారత్ MH 60R సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించే శత్రు జలాంతర్గాములను నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉంది. అదే సమయంలో, ఈ హెలికాప్టర్లు శత్రు స్థావరంపై దాడి చేసి సురక్షితంగా బయటకు రాగలవు. సముద్రం కింద దాగి ఉన్న జలాంతర్గాములను, సముద్ర ఉపరితలంపై ఉన్న శత్రు దేశపు నౌకలను గుర్తించి నిమిషాల వ్యవధిలో దాడి చేయగలవు.
MH60R సీహాక్ హెలికాప్టర్ శత్రు యుద్ధనౌకలపై దాడి, శోధన, రెస్క్యూ ఆపరేషన్, సిబ్బంది బదిలీ, వైద్య సామగ్రి తరలింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫోల్డబుల్ రోటర్లు, టెయిల్ ఉండడం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. అందువల్ల ఈ హెలికాప్టర్‌ను చిన్నపాటి ప్రదేశంలోనే పార్క్ చేయవచ్చు. చిన్న యుద్ధనౌకలలో సులభంగా దీన్ని తరలించవచ్చు. డ్యూయల్ ఎంబెడెడ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కారణంగా హెలికాప్టర్ కచ్చితమైన నావిగేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హెలికాప్టర్‌లో 38 లేజర్-గైడెడ్ రాకెట్‌లు, నాలుగు MK54 టార్పెడోలు, మెషిన్ గన్‌లు సముద్రంలో ఉన్న శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి.
MH 60R సీహాక్ వల్ల సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులను నాశనం చేయ్యవచ్చని MH 60R హెలికాప్టర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ ఎం. అభిషేక్ రామ్ ఈటీవీ భారత్‌తో తెలిపారు. శత్రు జలాంతర్గాములను పట్టుకోవడానికి MH 60R సీహాక్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. మరోవైపు, సముద్ర రంగంలో సైనిక అవసరాల కోసం ఉపయోగపడే ప్రపంచంలోనే అత్యుత్తమ హెలికాప్టర్ MH60R అని ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కృష్ణ అన్నారు. భారత సముద్ర సరిహద్దుల్లో శత్రువుల సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ హెలికాప్టర్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు.
MH 60R సీహాక్ హెలికాప్టర్ ముందు భాగంలోని ఫార్వర్డ్-లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లు ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణి కచ్చితమైన చిత్రాన్ని తీయగలవు. ఈ హెలికాప్టర్ ఒక ప్రాంతాన్ని స్కాన్ కూడా చేయగలదు. హెలికాప్టర్ గ్లాస్ కాక్‌పిట్ మల్టిపుల్ డిజిటల్ కాక్‌పిట్. ఇది రేయింబవళ్లు పనిచేస్తుంది. ఇందులో మిస్సైల్ వార్నింగ్ సిస్టమ్, లేజర్ వార్నింగ్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ మిస్సైల్ జామింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ విమానం రక్షణ, యుద్ధరంగంలో ప్రభావం చూపగలదు. ట్రయల్స్ పూర్తైన తర్వాత ఆరు MH 60R సీహాక్ హెలికాప్టర్లను INAS 334 ద్వారా ఇండియన్ నేవీలో మోహరించనున్నారు.
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పోలీసుల అదుపులో నలుగురు
ఒకటే కులం- రోడ్డుకు అటువైపు SC- ఇటువైపు OBC- ప్రభుత్వ పథకాల్లోనూ ఎంతో తేడా!