Martial Art Indian Army Training : చైనాతో సరిహద్దు కలిగిన వాస్తవాధీనరేఖ ప్రాంతంలోని గల్వాన్ లోయలో దాదాపు నాలుగేళ్లక్రితం జరిగిన హింసాత్మక ఘర్షణ నేపథ్యంలో సైనిక శిక్షణలో మార్పులు చేసినట్లు తెలిసింది. ఆయుధాల్లేకుండా శత్రువును దెబ్బకొట్టే విధంగా తర్ఫీదునిస్తున్నారు. ఆయా సైనిక రెజిమెంట్లలో సైనికులకు రోజువారీ ఫిట్‌నెస్ తోపాటు వివిధ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా భాగం చేసిన విషయాన్ని సైనిక వర్గాలు వెల్లడించినట్లు ఆంగ్లపత్రిక ఓ కథనం ప్రచురించింది. పంజాబ్ రెజిమెంట్ వారికి ఘాతక్, గూర్ఖా రెజిమెంట్‌కు కుక్రీ డ్యాన్స్, మద్రాస్ రెజిమెంట్‌కు కలిరిపయట్టు వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన సైనికులను అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబితు ప్రాంతంలో మోహరించారు. అయితే ఇటీవల కొందరు జర్నలిస్టుల ముందు వారు తాము నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శించారు.
ధ్రువీకరించిన సైనికాధికారులు
సైనిక శిక్షణలో మార్షల్ ఆర్ట్స్ చేరికను సైనికాధికారులు ధ్రువీకరించారు. స్థానిక భౌగోళిక స్వరూపం, గస్తీ సమయంలో ఎదురయ్యే సవాళ్లు భిన్నమైనవని మేజర్ కార్తికేయ జైస్వాల్ తెలిపారు. వేగంగా ప్రవహించే నదులు, ముళ్లు, వర్షాలు, త్వరగా మారిపోయే వాతావరణం, ఎత్తైన శిఖరాలు సహా ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల సైనికులకు రోజువారీ శిక్షణ తప్పనిసరి అని, అందులో మార్షల్ ఆర్ట్స్ ఒకటని మేజర్ కార్తికేయ జైస్వాల్ వెల్లడించారు. ఇలాంటి అభిప్రాయాన్నే కమాండింగ్ అధికారి కర్నల్ ప్రిన్స్ రోహిత్ కూడా వ్యక్తం చేశారు.
క్రావ్ మాగా మార్షల్ ఆర్ట్
గల్వాన్ హింసాత్మక ఘర్షణ తర్వాత ఉధంపుర్‌లోని ఉత్తర కమాండ్ ఇజ్రాయెల్‌కు చెందిన క్రావ్ మాగా అనే మార్షల్ ఆర్ట్స్‌ను ప్రవేశపెట్టింది. ఈమేరకు ఆయా యూనిట్లకు లేఖలు రాసింది. ఆ తర్వాత అవి తమకు అనుబంధంగా అవసరమైన యుద్ధ విద్యను ఎంపిక చేసుకున్నాయి. సరిహద్దుల వెంట ఘర్షణలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. మనకు ఇప్పటికే ఉన్న పలు దేశీయ మార్షల్ ఆర్ట్స్ ఆ సమయంలో సరిగ్గా సరిపోతాయని ఓ సైనికాధికారి తెలిపారు.
సైనికులకు ఫిట్‌నెస్ పరీక్ష
45ఏళ్లలోపు సైనికులకు ప్రతి త్రైమాసికంలో ఒకసారి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో భాగంగా యుద్ధ సన్నద్ధత, సమర్థత పరీక్ష (BPAT)ని వారు పూర్తి చేయాల్సి ఉంటుంది. 30ఏళ్లలోపువారు 5 కి.మీ. పరుగును 25 నిమిషాల్లో ముగించాలి. 30-40 మధ్య వయస్కులకు అదనంగా మరో రెండు నిమిషాల సమయం ఇస్తారు. అధికారుల ఫిట్‌నెస్ నిబంధనల్లోనూ సైన్యం మార్పులు చేసింది. అవి అమల్లోకి రావాల్సి ఉంది. 2020లో భారత్-చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ జరిగింది. ఈ సమయంలో ఇరుదేశాల సైనికులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద తుపాకులుసహా ఇతర ఆయుధాలు వినియోగించకూడదనే ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో సైనిక శిక్షణలో మార్షల్ ఆర్ట్స్‌ను భాగం చేసినట్లు తెలుస్తోంది.
సరిహద్దుల్లో ఉద్రిక్తత- భారీ చొరబాట్లకు ఉగ్రమూకల యత్నం, తిప్పికొట్టిన ఆర్మీ
దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట- రంగంలోకి NIA- పాక్ కుట్రలపై నిపుణుల హెచ్చరిక