Chennai Air Show Tragedy : తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షోలో అపశ్రుతి జరిగింది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన మెగా ఎయిర్ షోను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు పోటెత్తారు. తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడటం వల్ల వారంతా తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఉక్కపోత, ఎండవేడిమి తాళలేక ముగ్గురు సొమ్మసిల్లి ప్రాణాలు విడిచారు. మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. అస్వస్థతకు గురైన దాదాపు 230 మందిని చెన్నైలోని 3 ఆసుపత్రులకు తరలించారు. మృతులు శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్‌బాబు, దినేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఎయిర్ షోకు దాదాపు 13 లక్షలమందికి పైగా సందర్శకులు హాజరైనట్లు అంచనా.
అయితే ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకు కూడా ఇబ్బంది ఎదురైంది. చెన్నైనుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలిరావడం వల్ల మెరీనా బీచ్ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్‌టీఎస్ రైల్వేస్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి. షో ముగిసిన అనంతరం తిరుగుప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడం వల్ల ప్లాట్‌ఫాంలపై నిలబడేందుకూ వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అన్నా స్క్వేర్‌లోని బస్‌స్టాప్‌కు సందర్శకులు పోటెత్తారు.