Manipur Violence : మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇంఫాల్‌లో మంగళవారం ఓ సీనియర్ పోలీస్ అధికారిని మైతేయి వర్గానికి చెందిన కొందరు కిడ్నాప్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంది. నాలుగు కాలమ్‌ల అసోం రైఫిల్స్ బలగాలను ఇంఫాల్‌లో మోహరించినట్లు అధికారులు తెలిపారు.
అదనపు సూపరింటెండెంట్ పోలీస్ అమిత్ కుమార్‌ను మైతేయి సంస్థ అయిన ఆరంబాయ్ తెంగోల్ సభ్యులు మంగళవారం కిడ్నాప్ చేశారు. ఇంఫాల్ ఈస్ట్‌లోని వాంగ్ఖేయీ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిపై వారు దాడి చేశారని అధికారులు తెలిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారని చెప్పారు. గతంలో ఆ బృందానికి చెందిన ఆరుగురిని అరెస్ట్ చేయడంలో కుమార్ పాత్ర ఉందని, ఆ పగతోనే మైతేయీ వర్గం దాడి చేసిందని అధికారులు వివరించారు. రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బలగాలు, భద్రతా దళాలు అమిత్ కుమార్‌ను వారి నుంచి విడిపించాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ఉన్నాడని, ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.
ఇంట్లో విధ్వంసం
'ఆయుధాలతో వచ్చిన ఆ గుంపు అమిత్ కుమార్ ఇంట్లో విధ్వంసం సృష్టించింది. భీకరంగా కాల్పులు జరిపింది. నాలుగు వాహనాలను వారు ధ్వంసం చేశారు' అని అధికారులు వివరించారు. 'ఇంట్లోకి ప్రవేశించిన వారితో మేం మాట్లాడేందుకు ప్రయత్నించాం. కానీ వచ్చీరాగానే వారు కాల్పులు జరిపారు. వాహనాలు, ఇతర వస్తువులవైపు కాల్పులు జరిపారు. వెంటనే మా గదుల్లోకి వెళ్లి తాళం వేసుకున్నాం' అని అమిత్ కుమార్ తండ్రి ఎం కుల్లా వివరించారు.
అధికారి కిడ్నాప్
'ఘటన సమయంలో అమిత్ కుమార్ ఇంట్లో లేరు. అమిత్ తండ్రే ఆయనకు సమాచారం ఇచ్చారు. వెంటనే అమిత్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి తన ఇంటికి చేరుకున్నారు. కానీ, సాయుధులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వారిని నిలువరించలేకపోయారు. దీంతో అమిత్‌ను వారు కిడ్నాప్ చేసుకొని వెళ్లిపోయారు' అని అధికారులు పేర్కొన్నారు.
రెస్క్యూ ఆపరేషన్
ఘటన అనంతరం మణిపుర్ పోలీసులు వెంటనే స్పందించారు. బలగాలను సమీకరించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గంటల వ్యవధిలోనే అమిత్ కుమార్‌ను విడిపించుకొని సురక్షితంగా తీసుకొచ్చారు. రెస్క్యూ చర్యల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ సహాయం కోరింది. దీంతో నాలుగు కాలమ్‌ల అసోం రైఫిల్స్ బలగాలను ఘటన జరిగిన ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు.
తిరుగుబాటు దళంతో శాంతి ఒప్పందం!- మణిపుర్ సీఎం ప్రకటన
'మణిపుర్ హింసలో విదేశీ శక్తుల హస్తం?'.. RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు