Man Threatening Villagers Do Witchcraft : క్షుద్రపూజలు చేస్తూ గ్రామస్థులను బెదిరిస్తున్న ఓ మాంత్రికుడిని పట్టుకున్నారు పోలీసులు. సుమారు 20 పుర్రెలు, ఎముకలతో క్షుద్రపూజలు చేస్తుండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని రామనగరలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
జోగురు దొడ్డి గ్రామానికి చెందిన బలరామ్ గత కొన్ని రోజులుగా క్షుద్రపూజలు చేస్తున్నాడు. గ్రామంలోని శ్మశానవాటిక నుంచి పుర్రెలు, ఎముకలు సేకరించి, తన ఫామ్ హౌస్‌తో పాటు గ్రామంలోని శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. ముఖ్యంగా అమావాస్య రోజున క్షుద్రపూజలు చేసి తమను భయపెడుతున్నట్లు తెలిపారు. దీనిపై అతడిని ప్రశ్నించగా, గ్రామస్థులందరిపై క్షుద్రపూజలు చేస్తానని బెదిరిస్తున్నాడంటూ వాపోయారు. అయితే, ఆదివారం రాత్రి అమావాస్య కావడం వల్ల మరోసారి క్షుద్రపూజలు చేస్తుండగా గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బలరామ్‌తో పాటు అతడి సోదరుడు రవిని సైతం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 20 పుర్రెలు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు.
క్షుద్ర పూజల నెపంతో పిల్లల ముందే మహిళ హత్య
Woman Burnt Alive on Suspicion of Superstition : కొన్ని రోజుల క్రితం అసోంలోని తేజ్‌పుర్‌లో మంత్రాల నెపంతో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. పిల్లల ముందే మహిళను సజీవ దహనం చేశారు. బన్స్బరీకి చెందిన సంగీత క్షుద్ర పూజలు చేస్తుందంటూ అదే గ్రామానికి చెందిన సూరజ్ బగ్వా కుటుంబం ఆమె దాడి చేసింది. పదునైన ఆయుధంతో ఆదివారం రాత్రి ఆమెపై దాడి చేశారు. అనంతరం ఇద్దరు పిల్లల ముందే ఆమెను సజీవ దహనం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో మగ్గురిని అజయ్ సంఘర్, టింకో మల్హర్, సూర్య బగ్వాగా గుర్తించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరికి ముందే పాత కక్షలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.