Maharashtra Fire Accident Today : మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని ఓ టైలర్ షాప్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి శవపరీక్షల కోసం తరలించారు.
కంటోన్మెంట్ ప్రాంతంలోని జైన దేవాలయం సమీపంలో ఉన్న ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అసిం వసీం షేక్ (3), పరి వసీం షేక్ (2), వసీం షేక్ (30), తన్వీర్ వసీం (23), హమీదా బేగం (50), షేక్ సోహేల్ (35), రేష్మా షేక్ (22)ను మృతులుగా పోలీసులు గుర్తించారు.
"బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో దర్జీ దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సంబంధిత శాఖల అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. మాకు సహాయంగా స్థానికులు కూడా ఓ చేయి కలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నాం. విచారణ జరుగుతోంది. దర్యాప్తులో అగ్నిప్రమాదానికి గల కారణాలేమిటో తెలుస్తాయి"
- మనోజ్ లేహియా, ఔరంగాబాద్ సీపీ
ఘటనాస్థలికి ఎంపీ అభ్యర్థి
ఈ ఘటనపై జిల్లా లోక్‌సభ అభ్యర్థి, మాజీ ఎంపీ చంద్రకాంత్ కైరే స్పందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 'రంజాన్ మాసంలో దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం. ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు తెల్లవారుజామునే నిద్రలేస్తారు. కానీ, బుధవారం వారు నిద్రలేవకముందే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కింది అంతస్థులో ఉన్న టైలర్ షాప్‌లోని బట్టలు, ఫర్నీచర్ కారణంగా మంటలు పై అంతస్థులకు వేగంగా వ్యాపించాయి. దీంతో ఇంటిలోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. ఊపిరాడక ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది' అని మీడియాతో చెప్పారు. అయితే ఈ ప్రమాదం తన ఎలక్ట్రిక్ వాహనానికి పెట్టిన ఛార్జింగ్ కారణంగానే సంభవించి ఉంటుందని ప్రత్యక్ష సాక్షి సచిన్ దుబే తెలిపారు.