Lok Sabha MP to MLA : 17వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన 16 మంది ఎంపీలు ఇక్కడ ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లిపోయారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియాకుమారి, ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి అరుణ్ సాయ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నరేంద్రసింగ్ తోమర్, కేంద్రమంత్రి పదవి నుంచి రాష్ట్రమంత్రి పదవిలోకి వెళ్లిపోయిన ప్రహ్లాద్ పటేల్ ఉన్నారు. కొత్త పదవుల్లోకి మారడం, సభ్యులు కాలధర్మం వంటి కారణాల వల్ల 17వ లోక్‌సభలో 26 స్థానాలు ఖాళీ అయ్యాయి. 17వ లోక్‌సభ నుంచి భగవంత్ మాన్ (పంజాబ్), రేవంత్ రెడ్డి (తెలంగాణ), నాయబ్ సింగ్ సైనీ (హరియాణా) ముఖ్యమంత్రులు అయ్యారు.
ఎంపీ టు సీఎం
తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మల్కాజ్‌గిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, నల్గొండ, భువనగిరిల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు రాష్ట్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కారణంగా తమ లోక్‌సభ స్థానాలకు ముందే రాజీనామా చేశారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికవడం వల్ల ఆయన ఇదే దారిలో నడిచారు.
రాజస్థాన్‌లో నాలుగు స్థానాలు
ఇక రాజ్‌సమంద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన జైపుర్ మహారాజ మాన్‌సింగ్-2 మనుమరాలైన దియాకుమారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏకంగా ఆ రాష్ట్ర 6వ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జైపుర్ రూరల్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒలింపిక్ షూటర్, మోదీ తొలి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రిగా చేరిపోయారు. అదే రాష్ట్రంలోని ఆల్వార్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బాబా బాలక్‌నాథ్ తిజారా అసెంబ్లీ ఎన్నిక గెలుపొంది రాష్ట్ర రాజకీయాలకు వెళ్లిపోయారు. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ అధినేత హనమాన్ బేనీవాల్ అక్కడి నాగౌర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. కిన్వసర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది దిల్లీ వీడిపోయారు. ఇలా రాజస్థాన్‌లోనూ నాలుగు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయ్యాయి.
రాష్ట్ర మంత్రులుగా ఎంపీలు
ఐదు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉండి, 2003లో వాజ్‌పేయీ ప్రభుత్వంలో, 2019లో నరేంద్రమోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ప్రహ్లాద్ పటేల్ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వెళ్లిపోయారు. దామోహ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ప్రహ్లాద్ పటేల్ గత నవంబరులో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింగ్‌పుర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. నాలుగుసార్లు మధ్యప్రదేశ్‌లోని మొరేనా లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించి నరేంద్రసింగ్ తోమర్ 2014 నుంచి 2023 వరకు కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. నరేంద్రసింగ్ తోమర్ అసెంబ్లీ ఎన్నికల్లో దిమని స్థానం నుంచి గెలుపొంది అసెంబ్లీ స్పీకర్ పదవిలోకి వెళ్లిపోయారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైన జబల్‌పూర్ ఎంపీ రాకేష్‌సింగ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హోసంగాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందిన ఉదయ్ ప్రతాప్‌సింగ్ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. సిద్ధి స్థానం నుంచి 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన రీతిపాఠక్ అదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా వెళ్లిపోయారు. మొత్తంగా ఇలా ఈ రాష్ట్రం నుంచి 5 లోక్‌సభ స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు
ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పుర్ లోక్‌సభ స్థానానికి 17వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన అరుణ్ సావో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాయ్‌గడ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన గోమతి సాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా మారిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా స్థానం నుంచి గెలుపొంది కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రిగా పనిచేసిన రేణుకాసింగ్ సరూతా ఎమ్మెల్యే స్థానానికి పరిమితమయ్యారు. ఇలా ఎంపీలు అసెంబ్లీకి వెళ్లడం వల్ల చత్తీస్‌గఢ్‌లో మూడు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటితోపాటు సభ్యుల మరణం, అనర్హతవేటు, పార్టీల మార్పిడి కారణంగా రాజీనామా, ఎగువసభకు వెళ్లడంలాంటి కారణాలతో మొత్తం 26 స్థానాలు ఖాళీకావడం వల్ల పార్టీలు ఆ స్థానాల్లో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం వచ్చింది.
లోక్‌సభ బరిలో 15మంది మాజీ సీఎంలు- ఎన్డీఏ నుంచే 12మంది పోటీ - EX CMS IN LOK SaBHA ELECTIONS 2024