Lok Sabha Election Results 2024 Amritpal Singh : పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్, జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటం వల్ల ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతిస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి తెలిపారు. ఇలాంటి కేసుల్లో రాజ్యాంగ నిబంధనలు పాటించడం అత్యంత అవశ్యకమని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చట్టసభ్యుడిగా ప్రమాణం చేయడం అనేది రాజ్యాంగపరమైన హక్కు అని తెలిపారు. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నందున ప్రమాణస్వీకారం కోసం పార్లమెంట్‌కు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలని ఆచారి తెలిపారు.
సభా కార్యకలాపాలకు హాజరుకాలేరు
అయితే, జైల్లో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అందువల్ల ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరుకాలేకపోవడంపై స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్ కమిటీకి పంపుతారు. ఈ అభ్యర్థులను అంగీకరించాలా? వద్దా అన్నదానిపై కమిటీ సిఫార్సులు చేస్తుంది. వాటిపై సభలో ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని ఆచారి తెలిపారు.
2 లక్షల మెజార్టీతో ఇంజినీర్ రషీద్ గెలుపు
అమృత్‌సర్ జిల్లా అజ్‌నాలా పోలీసులపై దాడి కేసులో వారిస్ పంజాబ్ దే నాయకుడు, వేర్పాటువాది అమృత్‌పాల్ నిందితుడు. జాతీయ భద్రతా చట్టం కింద 2023 ఏప్రిల్‌లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అసోంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖడూర్‌సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో దాదాపు 2 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం అందుకున్నారు. అటు ఇంజినీర్ రషీద్‌గా గుర్తింపు పొందిన షేక్ అబ్దుల్ రషీద్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో అరెస్టయ్యారు. తాజా ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
రెండేళ్ల జైలు శిక్ష పడితే!
అయితే ఈ కేసుల్లో వారు దోషులుగా తేలి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షను ఎదుర్కొంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అనర్హులవుతారు. అప్పుడు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. జైలుశిక్ష కాలంతో పాటు మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.