Lok Sabha Election 2024 Result : అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ నినదించి 240 స్థానాలకే పరిమితమైంది అధికార బీజేపీ. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 32 స్థానాలు తగ్గాయి. దీంతో ఎన్డీఏలోని మిత్రపక్షాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే కూటమికి ఉన్న 53 మంది ఎంపీల మద్దతుతో ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారా? ఏవైనా పార్టీలు ఎన్డీఏకు హ్యాండ్ ఇస్తాయా? మద్దతు ఇచ్చినా కేంద్ర మంత్రి వర్గ కూర్పు ఎలా ఉంటుంది? లాంటి కీలక ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. ఈ క్రమంలోనే నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నాటకీయ పరిణామాలు సాగుతున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమి పోటాపోటీగా బుధవారం సాయంత్రం సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఇందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న, తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
- బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనతోపాటు కేంద్రమంత్రుల రాజీనామాలు సమర్పించారు.
- ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము, తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలని మోదీకి సూచించారు.
- బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోని సీనియర్ నేతలు బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. NDA పక్షాల భేటీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రధాని ప్రమాణస్వీకారంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఎల్జేపీ నేత చిరాగ్ పాసవాన్ పాల్గొన్నారు.
- బుధవారం ఎన్డీఏ కూటమిలోని సీనియర్ నేతలు సమావేశమైనప్పటికీ, ఆ తర్వాత కూడా వీరి మధ్య సంప్రదింపులు కొనసాగే అవకాశముంది. కేంద్ర మంత్రివర్గ కూర్పు, ఏ పార్టీ నుంచి ఎంతమంది కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ లాంటి పదవుల పంపకాలపైనా చర్చించనున్నట్లు సమాచారం.
- జూన్ ఏడో తేదీన ఎన్డీఏ కూటమి ఎంపీలు పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్లో సమావేశం కానున్నారు. ఆరోజే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
- కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో NDA ప్రభుత్వం ఈనెల 8న కొలువుదీరనుంది. మోదీ మూడోసారి ప్రధానిగా ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అంతకుముందు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని NDA మెజారిటీ సీట్లు సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సమీక్షించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన దిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో కేంద్ర మంత్రివర్గం చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం మంత్రి మండలి సమావేశం జరిగింది. రెండో దఫా మోదీ ప్రభుత్వంలో ఏర్పాటైన కేబినేట్, మంత్రిమండలికి ఇదే చివరి సమావేశం. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 240 సీట్లు సాధించగా NDA స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుంది. 2014లో 282 స్థానాలు, 2019లో 303 సీట్లతో సొంతంగా మెజార్టీ సాధించింది భారతీయ జనతా పార్టీ.
17వ లోక్‌సభ రద్దు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్‌సభను రద్దు చేశారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ సిఫారస్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రస్తుత లోక్‌సభను తక్షణం రద్దు చేయాలని కోరినట్లు తెలిపింది. కేంద్ర కేబినెట్ సలహాను రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.
మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్- ఎప్పుడంటే?
ఒకే విమానంలో దిల్లీకి నీతీశ్, తేజస్వి- ఏదైనా ట్విస్ట్ ఉంటుందా? - Lok Sabha Election results 2024