Lok Sabha Election 2024 Karnataka: అందరూ ఊహించినట్లే కర్ణాటకలోని బెళగావి, చిక్కోడి రెండు నియోజకవర్గాల్లో మంత్రుల వారసులకు టికెట్లు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో చిక్కోడి నియోజకవర్గం నుంచి మంత్రి సతీష్ జార్కిహోళి కుమార్తె ప్రియాంక బరిలో నిలిచారు. బెళగావి నుంచి కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ పోటీ చేయనున్నారు. ఈ ఇద్దరు వారసులకు ఇవే తొలి ఎన్నికలు కావడం విశేషం. రాజకీయ నేపథ్యానికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఈసారి ఎలాగైనా గెలవాలని ఈ రాజకీయ వారసులు పట్టుదలతో ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ కంచుకోటలైన బెళగావి, చిక్కోడి నియోజకవర్గాలను ఈసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం రచించింది. ఈ రెండు ఎంపీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగేందుకు ఎంతోమంది ఆసక్తి కనబర్చినా మంత్రుల వారసుల వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది. మంత్రుల పిల్లలకే టిక్కెట్లు ఇచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం, వారసుల గెలుపు బాధ్యతను వారికే అప్పగించింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ చిక్కోడి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ అన్నాసాహెబ్ జొల్లెను బరిలోకి దింపింది. బెళగావి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం జగదీష్ షెట్టర్‌కు టికెట్ దాదాపు ఖరారైంది. రెండు నియోజకవర్గాల్లోనూ మంత్రుల పిల్లలు రంగంలోకి దిగడం వల్ల రాబోయే లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
షెట్టర్ vs మృణాల్ (బెళగావి) : బెళగావి నియోజకవర్గంలో మాజీ సీఎం జగదీష్ షెట్టర్‌పై 31 ఏళ్ల యువ నాయకుడు మృణాల్ పోటీ పడుతున్నారు. ఆయన తల్లి లక్ష్మీ హెబ్బాల్కర్ కర్ణాటక ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన మృణాల్ 2013 నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ యూత్ విభాగం బెళగావి అధ్యక్షులుగా పనిచేశారు. మృణాల్ షుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, హర్ష షుగర్స్ సవదత్తి డైరెక్టర్‌గా, లక్ష్మీతాయ్ సౌహార్ద సహకార నిమిత డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.
అన్నాసాహెబ్ vs ప్రియాంక (చిక్కోడి): చిక్కోడి సిట్టింగ్ ఎంపీ అన్నాసాహెబ్ జొల్లెపై 27ఏళ్ల ప్రియాంక జార్కిహోళి పోటీ చేస్తున్నారు. ప్రియాంక తండ్రి సతీష్ జార్కిహోళి కర్ణాటక ప్రజా పనుల శాఖలో ఇన్‌చార్జ్ మంత్రిగా పనిచేస్తున్నారు. 2018 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యురాలిగా కొనసాగుతున్న ప్రియాంక, జార్కిహోళి ఫౌండేషన్ ద్వారా యమకనమరడి నియోజకవర్గంలో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సతీష్ షుగర్ లిమిటెడ్, బెలగం షుగర్ ప్రైవేట్ లిమిటెడ్, గడిగావ్ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వెస్ట్రన్ ఘాట్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, నేచర్ నెస్ట్ హార్టికల్చర్ ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 14 సంస్థలకు డైరెక్టర్‌గానూ ఉన్నారు.
కర్ణాటకపై BJP స్పెషల్ ఫోకస్- మైసూర్ యువరాజుకు టికెట్- 2019 సీన్ రిపీట్‌కు పక్కా ప్లాన్!