రైళ్లలో 'రీల్స్' చేస్తే - ఇకపై కేసులు తప్పవ్! - LODGE FIR AGAINST REEL CREATORS
రైల్వే ప్రాంగణాల్లో, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర రీల్స్ చేసేవాళ్లకు హెచ్చరిక - ఇకపై ఇలా రీల్స్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు తప్పవ్!


Published : Nov 15, 2024, 10:15 PM IST
Lodge FIR Against Reel Creators : రైల్వే కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తూ, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే రీతిలో రీల్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రైల్వే బోర్డు సిద్ధమైంది. రైల్వే ప్రాంగణాల్లో, కదులుతున్న రైళ్లలో ప్రమాదకరమైన రీతిలో రీల్స్ చేసే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అన్ని జోన్లకు సూచించింది. రైల్వే ట్రాక్‌లు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్న (Reels) ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హద్దులు మీరుతున్నారు!
"కొందరు ఆకతాయిలు అన్ని హద్దులు దాటాతున్నారు. రైల్వే ట్రాకులపై వస్తువులు పెట్టడం, వాటిపై వాహనాలు నడపడం, కదులుతున్న రైళ్లలో ప్రమాదకరంగా స్టంట్లు చేయడం లాంటి వికృత చేష్టలు చేస్తున్నారు. దీని వల్ల వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా, వందల మంది రైలు ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు" అని ఓ సీనియర్ రైల్వే అధికారి పేర్కొన్నారు. రైళ్లకు దగ్గరగా వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ చనిపోతున్న ఘటనలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. అందుకే నిబంధనలు అతిక్రమిస్తూ రీల్స్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ పోలీసులకు రైల్వే బోర్డు సూచించినట్లు తెలుస్తోంది.
జైపుర్ డివిజన్‌లో ఇటీవల రైల్వే ట్రాక్‌పై ఓ ఎస్‌యూవీ కారును నడిపిస్తూ స్టంట్లు చేసిన వారిపై ఆర్‌పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే సదరు యువకులు ఈ వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తతో ఈ ప్రమాదం తప్పగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు, చెన్నైలో కొందరు కాలేజీ స్టూడెంట్స్ రైల్లో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడమే కాకుండా రైల్వే స్టేషన్‌లో గందరగోళం సృష్టించారు. అంతేకాదు వాళ్లు రైలుపైకి ఎక్కేందుకు ప్రయత్నించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి 10 మంది విద్యార్థులపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తరహాలోనే అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో కఠిన చర్యలకు రైల్వే బోర్డు ఉపక్రమించింది. రైల్వే ప్రాంగణాల్లో, రైళ్లలో రీల్స్ లాంటివి చేసేవారిపై కేసులు నమోదు చేయాలని అన్ని జోన్లకు సూచించింది.