Lal Bahadur Shastri Jayanti 2024 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, అపర చాణక్యుడు, నీతికి నిలువుటద్దమైన రాజకీయ వేత్త లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు. ఆ మహనీయుని గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుడి ప్రధాన విధి.
జననం
నిరాడంబరతకు మారుపేరు, అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబరు 2న జన్మించారు. శాస్త్రి తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, తల్లి రామ్ దులారి దేవి.
విద్యాభ్యాసం
చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే లాల్ బహదూర్ శాస్త్రి పట్టుదలకు మారుపేరు. శాస్త్రిగారు చిన్నతనంలో పాఠశాలకు వెళ్లాలంటే ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్లాల్సి వచ్చేది. పడవ వాడికి ఇవ్వడానికి డబ్బులు లేక శాస్త్రి గంగానది ఈదుకుంటూ పాఠశాలకు వెళ్లే వారు.
వివాహం
1928 మే 16న శాస్త్రి మీర్జాపూర్‌కు చెందిన లలితా దేవిని వివాహమడాడు. ఈ వివాహం పెద్దలచే సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
గొప్ప వ్యక్తుల ప్రభావం
యువకుడిగా శాస్త్రి స్వామి వివేకానంద, గాంధీజీ, అనీబిసెంట్ వంటి గొప్ప వ్యక్తుల చరిత్రలను, వారు చేసిన సేవలను గూర్చి అధ్యయనం చేసి స్వాతంత్రోద్యమంపై మక్కువ పెంచుకున్నారు. గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్‌లో చేరి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శాస్త్రి ఒక సంవత్సర కాలం జైలుశిక్ష అనుభవించారు. శాస్త్రి స్వాతంత్రోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. అతను జైలులో ఉన్న కాలంలో పుస్తకాలు చదివి పశ్చిమ దేశాల తత్వవేత్తలు, విప్లవకారులు, సాంఘిక సంస్కర్తల కృషిని బాగా తెలుసుకున్నారు.
బాధ్యతాయుత రైల్వే మంత్రిగా!
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పని చేసారు శాస్త్రి. దేశంలో అతిపెద్ద రైల్వే ప్రమాదం జరిగినప్పుడు శాస్త్రి నైతిక భాద్యత వహిస్తూ రైల్వే మంత్రిగా రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.
దేశ ప్రధానిగా!
జవహర్‌లాల్ నెహ్రూ మరణం తరువాత దేశానికి రెండవ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన శాస్త్రి దేశంలో ఆహార కొరత లేకుండా ఉండడానికి గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదాలతో దేశాన్ని ఒక్క తాటిపై నడిపించిన మహనీయుడు శాస్త్రి.
మరణం
పాక్‌తో జరుగుతున్న యుద్ద విరమణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ఉద్దేశించిన తాష్కెంట్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన శాస్త్రి గారు అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి ఆయన భార్య లలితశాస్త్రి ఎంత ప్రయతించినా కానీ ఫలితం లేకపోయింది.
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం
తన జీవితమంతా నిజాయితీగా బతికిన శాస్త్రి చనిపోయేవరకు సొంత ఇంటిని నిర్మించుకోలేక పోయారు. దేశ ప్రధాని కాకముందు అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెల్చిన సమయంలో ట్రస్టు ద్వారా వచ్చిన ఇంటి స్థలాన్ని తిరిగి ట్రస్టుకు అప్పజెప్పి మరణించే వరకు సొంత ఇల్లు లేకుండా జీవించిన నిరాడంబరుడు లాల్ బహదూర్ శాస్త్రి.
భర్తకు తగిన ఇల్లాలు
లాల్ బహదూర్‌శాస్త్రి దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొడుకుల కోరిక మేరకు అప్పు చేసి ఒక కారు కొని, చివరకు అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శాస్త్రి మరణించారు. ఈ సంగతి తెలిసి దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు, ఆయన భార్య లలితాశాస్త్రికి మనీ ఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట. భర్తకు తగ్గ మహా ఇల్లాలు లలితా శాస్త్రి.
అవార్డులు - పురస్కారాలు
- నిజాయితీపరునిగా, మానవతావాదిగా పేరొందిన లాల్ బహాదుర్ శాస్త్రి మరణాంతరం భారతరత్న పొందిన వ్యక్తులలో మొదటివారిగా నిలిచారు.
- వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయానికి లాల్ బహాదుర్ శాస్త్రి పేరు పెట్టారు.
- హైదరాబాద్, అహ్మదాబాద్, కొల్లం, కేరళ, భవానీపాట్నాలలో లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో స్టేడియంలు ఉన్నాయి.
- కృష్ణా నదిపై ఉత్తర కర్నాటకలో నిర్మిచిన ఆల్మట్టి డ్యామ్‌కు "లాల్ బహాదూర్ శాస్త్రి సాగర్"గా నామకరణం చేశారు.
- భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఐదు రూపాయల నాణేన్ని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రంతో విడుదల చేసింది.
పదవులకే అలంకారం
ఇలా ఒకటా, రెండా! బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. ఏ పదవులైనా, అవార్డులైనా అవి శాస్త్రి గారిని చేరిన తర్వాత వాటి ఖ్యాతి మరింత పెరిగింది.
ఆత్మీయ నివాళి
ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ గల నాయకులు చాలా అరుదుగా ఉంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడిస్తే భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఆయన జన్మదినం సందర్భంగా ఆత్మీయ నివాళులు అర్పిద్దాం.
జై జవాన్ ! జై కిసాన్!