Kolkata Rape And Murder Case : ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న కోల్‌కతా హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తన గొంతెమ్మ కోరికలతో అధికారులకు చిర్రెత్కుకొచ్చేలా చేస్తున్నాడు. వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనపై యావద్దేశం భగ్గుమంటున్నప్పటికీ జైలులో తనకు రాజమర్యాదలు కావాలంటూ చాలా అతి చేస్తున్నాడు. మిగతా ఖైదీలకు అందించే భోజనమే తనకు ఎలా ఇస్తారంటూ అధికారులతో వాదిస్తున్నాడు.
అందరికీ వడ్డించినట్లే అతడికీ జైలులో రోటీ, సబ్జీ వడ్డించామని, తనకు ఎగ్ నూడుల్స్ కావాలని నిందితుడు డిమాండ్ చేసినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. సంజయ్‌రాయ్ అతిని చూసి జైలు సిబ్బంది మందలించగా చివరకు వడ్డించిన పదార్థాలు తినడం అలవాటు చేసుకున్నాడని చెప్పాయి. జైలుకు తరలించిన ప్రారంభంలో పగలు కూడా తాను నిద్రపోయేందుకు అనుమతించాలని అడిగేవాడని, తనలో తాను మాట్లాడుకునేవాడని, కొన్ని రోజులకు సాధారణ జీవనశైలికి వచ్చేశాడని జైలు వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు సంజయ్‌రాయ్ తాను నిర్దోషినని, కావాలనే కేసులో తనను ఇరికించారని లై డిటెక్షన్ పరీక్షలో చెప్పినట్లు, అతడి న్యాయవాది కవితా సర్కార్ తెలిపారు. హత్యాచార ఘటన తర్వాత ఏం చేశావని లైడిటెక్షన్ టెస్ట్ సమయంలో సీబీఐ అధికారులు అడిగినప్పుడు అది అర్థం లేని ప్రశ్న అని, అసలు హత్యే చేయలేదని నిందితుడు చెప్పినట్లు లాయర్ పేర్కొన్నారు. తాను సెమినార్ హాల్ లోపలకు వెళ్లేసరికే ఆమె రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయి ఉందని, దీంతో వెంటనే భయంతో బయటకు పరిగెత్తి వచ్చినట్లు తనకు చెప్పాడని కవితా సర్కార్ తెలిపారు. ఆ వైద్యురాలు ఎవరో కూడా తనకు తెలియదని నిందితుడు సీబీఐకి చెప్పినట్లు లాయర్ పేర్కొన్నారు. ఆ ఘటనను చూసినప్పుడు ఎందుకు పోలీసులకు చెప్పలేదని సీబీఐ ప్రశ్నించగా తనను ఎవరూ నమ్మరన్న భయంతో చెప్పలేదని అన్నట్లు వివరించారు. సంజయ్ సెమినార్ హాల్‌కు అంత సులభంగా వెళ్లగలిగి ఉంటే అక్కడ భద్రతా లోపం ఉన్నట్లేనని, ఘాతుకానికి మరొకరు పాల్పడి ఉండొచ్చని లాయర్ అనుమానం వ్యక్తం చేశారు.