బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం పశ్చిమ బంగా ఛాత్రో సమాజ్ మంగళవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. నబన్నా అభియాన్ పేరుతో హావ్‌డా నుంచి ప్రారంభమైన ర్యాలీని సంతర్‌గాచి వద్ద పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చ్‌లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నింటిని లాగి పడేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వీరిపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ఎంజీ రోడ్, జీటీ రోడ్డులో ఇదే తరహా పరిస్థితి నెలకొంది.
"మమ్మల్ని పోలీసులు ఎందుకు కొట్టారు? మేం ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదు. చనిపోయిన డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధ్యత వహించి రాజీనామా చేయాలి" అని నిరసనలో పాల్గొన్న ఓ మహిళ డిమాండ్ చేశారు. అయితే నిరసనకారుల రాళ్ల దాడిలో పలువురు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
మమతకు పాలిగ్రాఫ్ పరీక్ష చేయాల్సిందే!
మరోవైపు, విద్యార్థులపై లాఠీఛార్జి చేయడాన్ని బీజేపీ ఖండించింది. మమత బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రమేయం ఉన్నవారిని మమత రక్షించారని ఆరోపించింది. కేసులో నిజనిజాలు తెలుసుకోవడానికి మమతతోపాటు పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్‌కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసింది.