Kejriwal CM Office In Jail : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగవచ్చా? లేదా? అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇక కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి తరలించిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రం జైలు నుంచే పరిపాలన చేస్తారని చెబుతోంది. తాజాగా దీనిపై ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ స్పందించారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలిస్తారని, ఈ మేరకు జైల్లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పారు.
''జైలు నుంచి పరిపాలన చేయకూడదని ఎక్కడా చెప్పలేదు. జైలు కెళ్లినంత మాత్రాన నేరస్థుడు కాదని చట్టం చెబుతోంది. కాబట్టి ప్రభుత్వాన్ని నడిపేందుకు జైల్లోనే కార్యాలయం ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం'' అని భగవంత్ మాన్ చెప్పారు. ఆమ్‌ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ స్థానాన్ని ఏ ఒక్కరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఆప్‌ను ఆయనే స్థాపించారని మాన్ తెలిపారు.
అయితే జైలులో ఉన్నా కేజ్రీవాల్ దిల్లీ సీఎంగా కొనసాగవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా అరెస్టయిన వ్యక్తి ఆ పదవిలో కొనసాగడంపై చట్టంలో ఎలాంటి నిషేధమూ లేదని ఓ సీనియర్ న్యాయవాది చెప్పారు. సాంకేతికంగా జైలు నుంచి పరిపాలించడం సాధ్యమేనని పేర్కొన్నారు. అయితే, చట్టపరంగా ఎలాంటి నిషేధం లేకున్నా పరిపాలనా పరంగా కొనసాగడం అసాధ్యమేనని మరో న్యాయవాది చెప్పారు.
అత్యవసర విచారణకు హైకోర్టు నో
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టు తలుపుతట్టారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేశారు. ఆయన్ని ఈడీ కస్టడీకి అప్పగించడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టి వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసుపై అత్యవసర విచారణ చేపట్టడానికి హైకోర్టు నిరాకరించింది. మార్చి 27న దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.
అవినీతి కేసులోనే కేజ్రీ అరెస్టు విడ్డూరం : అన్నా హజారే
మరోవైపు కేజ్రీవాల్‌పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి విరుచుకుపడ్డారు. అవినీతి వ్యతిరేక 'జన్‌లోక్‌పాల్' ఉద్యమంలో భాగమైన ఆయన ఇప్పుడు అవినీతి కేసులోనే అరెస్టు కావడం విడ్డూరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని, ఆయన రాజకీయ ఆశయాలు 2011 నాటి ఉద్యమాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
"దిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం బాధగా ఉంది. ఒకప్పుడు అవినీతిపై పోరాటంలో నా సహచరుడు ఇప్పుడు అవినీతి కేసులోనే అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. 'జన్‌లోక్‌పాల్' రాజకీయ ప్రత్యామ్నాయం విఫలం కావడం దురదృష్టకరం. రాజకీయ ఆకాంక్షల వల్లే అవినీతి వ్యతిరేక ఉద్యమం నాశనమైంది" అని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నా హజారే తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ 'స్వరాజ్' పుస్తకంలో లిక్కర్ పాలసీకి సంబంధించిన అంశాలపై 2022లో రాసిన లేఖలోనే తాను హెచ్చరించినట్లు అన్నా హజారే గుర్తు చేశారు.