Karnataka Reservation Bill For Locals : సోమవారం సమావేశమైన కర్ణాటక మంత్రివర్గం ఆ రాష్ట్రంలో నెలకొల్పిన ప్రైవేటు పరిశ్రమల్లో సి, డి గ్రేడ్ పోస్టులను వందశాతం కన్నడిగులకే ఇవ్వాలనే బిల్లును ఆమోదించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. కర్ణాటకవాసులు సుఖవంతమైన జీవనం గడిపేందుకు అవకాశం కల్పించాలని, ఈ గడ్డపై ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ ప్రాధాన్యమని పోస్ట్ చేశారు. దీనిపై పారిశ్రామిక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన వేళ ఆ పోస్టును సిద్ధరామయ్య తాజాగా తొలగించారు.
క్లారిటీ ఇచ్చిన కార్మిక శాఖ
ఆ తర్వాత మరో ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య, నాన్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 70 శాతం, మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరోవైపు ఈ విషయంపై కర్ణాటక కార్మిక శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 70 శాతం, మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు వెల్లడించింది. న్యాయశాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేటు పరిశ్రమల్లో లోకల్ కోటా రిజర్వేషన్లు పొందాలంటే అభ్యర్థులు కన్నడ ఒక భాషగా కలిగిన సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అది లేకపోతే కన్నడ భాషలో తమకు ప్రావీణ్యత ఉందని సంబంధిత నోడల్ ఏజెన్సీ నిర్వహించే ప్రావీణ్యత పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుంది. అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులు లేకపోతే ప్రభుత్వ సహకారం లేదా ఏజెన్సీల సహకారంతో అభ్యర్థులకు ప్రైవేటు పరిశ్రమలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించే కంపెనీలకు 10 వేల నుంచి 20 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కూడా తప్పు పునరావృతమైతే రోజుకు వంద రూపాయల చొప్పున పెనాల్టీ వేస్తారు.
ప్రభుత్వ నిర్ణయంపై పారిశ్రామికవేత్తలు ఫైర్
కర్ణాటక కేబినెట్ నిర్ణయంపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు కర్ణాటక నుంచి వెళ్లిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించారు. ఇలాంటి చర్యల కంటే స్థానికులకు నైపుణ్యాలు మెరుగుపరిచే దిశగా కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఈ బిల్లు పూర్తి వివక్షపూరితమైనదని, దాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి ఒక బిల్లును తీసుకొస్తుందంటే నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ప్రైవేటు సెక్టార్‌లోని రిక్రూట్‌మెంట్ బోర్డులో ప్రభుత్వ అధికారి కూర్చుంటారా? ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది అని ప్రశ్నించారు.
బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లుని అనుమతించకూడదని ఆమె సూచించారు. అధిక నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలన్నారు.
భయపడాల్సిన అవసరం లేదు : మంత్రి
ఈ నిరసన వేళ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. బిల్లుపై విస్తృతస్థాయి చర్చకు అవకాశం ఉందని భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం, అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.