Karnataka CM Siddaramaiah Love Story : తాను కులాంతర వివాహం చేసుకోవాలనుకున్నానని, అందుకు తన ప్రేయసి, ఆమె కుటుంబం అంగీకరించలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆ తర్వాత తన కులానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. మైసూరులో బుద్ధపూర్ణిమ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో గురువారం రాత్రి సిద్ధరామయ్య మాట్లాడారు. ఈ క్రమంలో తన కాలేజీ రోజుల్లో జరిగిన లవ్ స్టోరీని గుర్తు చేసుకున్నారు. సిద్ధరామయ్య తన విఫల ప్రేమ కథను వెల్లడించిన సమయంలో సభికులు చప్పట్లతో సభను మార్మోగించారు.
"నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. నేను ఆమెను కులాంతర వివాహం చేసుకోవాలనుకున్నాను. కానీ కులం కారణంగా నా ప్రేయసి, ఆమె కుటుంబం పెళ్లికి అంగీకరించలేదు. దీంతో నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి జరగలేదు. ఆ తర్వాత నా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. "
--సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
'కులాంతర వివాహాలకు నా పూర్తి మద్దతు'
కులాంతర వివాహాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కులాంతర వివాహాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కులతత్వాన్ని రూపుమాపడానికి రెండే మార్గాలున్నాయన్నారు సిద్ధరామయ్య. అందులో ఒకటి కులాంతర వివాహాలు, రెండోది అన్ని వర్గాల మధ్య సామాజిక-ఆర్థిక సాధికారిత అని పేర్కొన్నారు.
'గౌతమ బుద్ధుడు, కర్ణాటకకు చెందిన సంఘ సంస్కర్త బసవేశ్వర భగవానుడు కులతత్వాన్ని నిర్మూలించి సమాజంలో సమానత్వాన్ని నిర్మించే ప్రయత్నాలు చేశారు. సమాజంలో సమానత్వం కోసం అనేక మంది సంఘ సంస్కర్తలు చేసిన కృషికి ఇంకా ఫలితం రాలేదన్న విషయాన్ని ఖండిస్తున్నా. సామాజిక-ఆర్థిక సాధికారత లేని సమాజంలో సమానత్వం రాదు.' అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
సిద్ధరామయ్య రాజకీయ జీవితం
కర్ణాటక రాజకీయాల్లో అపారమైన అభిమానులన్న నేతల్లో సిద్ధరామయ్య ప్రముఖుడు. దేవరాజ్ అరసు తర్వాత ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసింది సిద్ధరామయ్యే. జనతా పరివార్ నుంచి 2006లో కాంగ్రెస్‌లోకి వచ్చినా పార్టీ భావజాలాన్ని సులువుగా ఆకళింపు చేసుకున్నారు. బలహీనవర్గాల సముదాయానికి ప్రతినిధిగా ఉండేందుకు ఆయన ఇష్టపడతారు. జనతాదళ్‌లోనూ ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య ఇప్పటి వరకు అత్యధికంగా 13సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత సొంతం చేసుకున్నారు. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వల్ల సీఎం పీఠాన్ని సిద్ధరామయ్య మరోసారి అధిరోహించారు.
గుడికి వెళ్తుండగా ప్రమాదం- ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి - haryana road accident