Jharkhand Election 2024 Results : ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం కూటమి మరోసారి విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ 81 అసెంబ్లీ స్థానాలకు గానూ 56 చోట్ల గెలుపొందింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. కౌంటింగ్ ఆరంభం నుంచే జేఎంఎం తన జోరును కొనసాగించింది.
ఆ అంశాలే కీలకం
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఓ అవినీతి కేసులో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ అరెస్టు కావడం కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. ఈ విషయాన్ని రాజకీయ కుట్రగా ఆరోపిస్తూ ఎన్నికల్లో అస్త్రంగా ఉపయోగించుకుంది. మహిళలకు నెలకు ఇచ్చే వెయ్యి రూపాయలను రూ.2500కు పెంచడం వంటి పథకాలు కలిసి వచ్చాయి. 'సర్నా'ను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేఖ రాయడం కూడా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హేమంత్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్, కల్పనాలు కలిసి దాదాపు 200 సమావేశాలను నిర్వహించారు.
పని చేయని బీజేపీ అస్త్రాలు
హేమంత్ సోరెన్ అవినీతి ప్రభుత్వమని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తోందంటూ - బీజేపీ తమ ఎన్నికల ప్రచారాల్లో ప్రధానంగా విమర్శలు గుప్పించింది. హేమంత్ అరెస్టు నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టిన చంపయీ సోరెన్, హేమంత్ బయటకు రాగానే రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన బీజేపీలో చేరిపోయారు. హేమంత్ వదిన సీతా సోరెన్ కూడా కాషాయ కండువా కప్పుకోవడం జేఎంఎంకు పెద్ద ఎదురుదెబ్బగా మిగిలింది. చంపయీ సోరెన్‌ను సీఎం పదవి నుంచి తప్పించడం గిరిజనులను అవమానపరచడమేనని ప్రచారం చేసినప్పటికీ, ఫలితాల్లో మాత్రం బీజేపీకి నిరాశ తప్పలేదు. ఆదివాసీ ప్రాంతాల్లో చంపాయీకి ఉన్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీలుస్తుందని, అది జేఎంఎం-కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపిస్తుందని భావించినప్పటికీ ఫలితాలు వేరుగా వచ్చాయి.
అంతంత మాత్రంగానే కాంగ్రెస్
మొత్తం 81 స్థానాలకుగాను జేఎంఎం 43 చోట్ల పోటీ చేయగా 34 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 30 చోట్ల పోటీ చేసినప్పటికీ 16 స్థానాలకే పరిమితమైంది. ఆర్జేడీ నాలుగు స్థానాల్లో, సీపీఐ ఎంఎల్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. ఇందులో బీజేపీ 21 స్థానాలు దక్కించుకోగా, మిత్రపక్షాలైన ఎల్‌జేపీ రామ్‌విలాస్ పాసవాన్ పార్టీ, జేడీయూ, ఎజేఎస్‌యూ తలో స్థానంలో గెలుపొందాయి. జేఎల్కేఎంకు ఒక స్థానం దక్కింది.
ఝార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ నిర్వహించారు. ఈసారి రికార్డు స్థాయిలో 67.74 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 81 స్థానాల్లో 1211 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.