Jharkhand Train Accident Today : ఝార్ఖండ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. భాగల్‌పుర్ నుంచి యశ్వంత్‌పుర్ వెళ్లే అంగ్ ఎక్స్‌ప్రెస్ కాలా ఝరియా సమీపంలో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. అంగ్ ఎక్స్‌ప్రెస్‌లోని చాలా మంది ప్రయాణికులు రైలు నుండి దిగారు. ఈ సమయంలో ఇతర ట్రాక్‌లో అసన్సోల్ నుంచి బైద్యనాథ్‌ధామ్‌కు వెళ్తున్న ప్యాసింజర్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అప్రమత్తమైన సిబ్బంది ఘటనాస్థలానికి వైద్య బృందాలను, అంబులెన్స్‌లను తరలించారు.
జామ్తాడా జిల్లాలోని కల్జారియా ప్రాంతంలో కొంతమంది ప్రయాణికులు రాంగ్ సైడ్ నుంచి రైలు నుండి దిగడం వల్ల ప్రమాదం జరిగిందని జామ్తాడా సబ్ డివిజన్ పోలీసు అధికారి (SDPO) రెహమాన్ తెలిపారు. 'ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను వెలికితీశారు. రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నాం' అని చెప్పారు.
స్పందించిన రాష్ట్రపతి
ఝార్ఖండ్‌లోని జామ్తాడా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. 'రైలు ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. మరోవైపు, జామ్తాడా రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు ఝార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా. ఘటనాస్థలిలో త్వరితగతిన సహాయక చర్యలను చేపట్టాలని కోరారు.
పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఝార్ఖండ్ సెరైకెలా-ఖర్స్వాన్ జిల్లాలోని గమ్హారియా రైల్వే స్టేషన్ సమీపంలో కొన్నాళ్ల క్రితం జరిగింది. ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు టాటానగర్ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలో దట్టమైన పొగమంచు అలుముకున్నట్లు వారు చెప్పారు. ఈ క్రమంలోనే పట్టాలు దాటుతున్న నలుగురు ప్రయాణికులను రైలు ప్రమాదవశాత్తు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా అక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన వెంటనే మృతదేహాలు ట్రాక్‌పైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తోటి ప్రయాణికులు పేర్కొన్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.