- 22.29 PM
"ఈడీ, సీబీఐ, ఐటీ మొదలైనవి ప్రభుత్వ సంస్థలు కావు. ఇప్పుడు అవి బీజేపీకి 'ఎలిమినేట్ ప్రతిపక్ష సెల్'గా మారాయి. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీయే అధికార వ్యామోహంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రచారాన్ని నడుపుతోంది" అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
- 22.23 PM
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. "మోదీతో వెళ్లని వారు జైలుకు వెళ్తారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్‌తో ఈడీ బలవంతంగా రాజీనామా చేయించింది. ప్రతిపక్ష నేతలను భయపెట్టడం బీజేపీ టూల్ కిట్‌లో భాగం. కుట్రలో భాగంగా విపక్ష ప్రభుత్వాలను ఒక్కొక్కటిగా అస్థిరపరుస్తోంది బీజేపీ. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం నుంచి కాపాడాలంటే బీజేపీని ఓడించాలి. మేం భయపడం. పార్లమెంట్ నుంచి వీధుల వరకు పోరాటం కొనసాగిస్తాం" అని ట్వీట్ చేశారు.
- 22.14 PM
హేమంత్ సోరెన్ రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వెల్లడించింది.
- 22.07 PM
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హేమంత్‌ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈడీ ఆఫీస్‌కు హేమంత్ సతీమణి కల్పన చేరుకున్నారు.
- 09.30 PM
తమ ప్రభుత్వానికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు జేఎంఎం శాసనసభా పక్ష నేత చంపయీ సోరెన్ తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ అనుమతి కోరామని చెప్పారు. అంతకముందు, సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ తన నివాసానికి చేరుకున్నారు.
- 9.15 PM
జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలంగీర్ ఆలం, కార్మికశాఖ మంత్రి సత్యానంద్ భోక్తా, చంపై సోరెన్ ఎమ్మెల్యేలు ప్రదీప్ యాదవ్, వినోద్ కుమార్ సింగ్ రాజీనామా సమర్పించే సమయంలో హేమంత్ సోరెన్ వెంట ఉన్నారు.
Jharkhand Next CM Champai Soren : ఝార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయనను శాసనసభా పక్ష నేతగా ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలు ఎంచుకున్నట్లు మంత్రి బన్నా గుప్తా తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవం కోసం గవర్నర్‌ను అభ్యర్థించడానికి రాజ్‌భవన్‌కు వెళ్లినట్లు ఆయన చెప్పారు.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ఈడీ విచారణతో ఝార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు, రాజకీయ హైడ్రామా నడుమ మధ్యాహ్నం నుంచి దాదాపు ఆరు గంటలకు పైగా హేమంత్‌ను ఈడీ అధికారులు విచారించారు.
ఎవరీ చంపై సోరెన్?
చంపయీ సోరెన్ సెరైకెల్లా నియోజవకర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జేఎంఎంలో చేరకముందు ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేగానూ ఎన్నికై సేవలందించారు. ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన చంపయీ సోరెన్ ఝార్ఖండ్ టైగర్ గా పేరొందారు. రైతు బిడ్డ ఆయనకు హేమంత్ సోరెన్ కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదు.