Jharkhand MLAs Remarks : ఝార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన తర్వాత రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. హేమంత్ తర్వాత ఏర్పాటైన చంపయీ సోరెన్ ప్రభుత్వం సోమవారం బలం నిరూపించుకోవాల్సి ఉన్న తరుణంలో జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీపై అసహనంతో ఉన్నట్లు తెలిసింది. అయితే 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్‌లో తమకు 47 మంది ఎమ్యెల్యేల బలముందని చంపయీ సోరెన్ చెబుతున్నారు.
హేమంత్ సోరెన్‌పై తీవ్ర విమర్శలు
హేమంత్ సోరెన్‌పై ఎమ్మెల్యే హెంబ్రోం తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఓ కార్యక్రమానికి హాజరైన హెంబ్రోం, జేఎంఎంతో అన్ని బంధాలను తెంచుకోనున్నట్లు ప్రకటించారు. గిరిజన భూములకు రక్షణ కల్పించే చోటా నాగ్‌పుర్, సంతాన్ పరగణాస్ టెనన్సీ చట్టాలను అమలు చేస్తామన్న హామీని హేమంత్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. తనకు శిబు సోరెన్ అంటే ఎంతో అభిమానమని హెంబ్రోం అన్నారు. అయితే ఆయన కోరుకున్నట్లు ప్రభుత్వ పనితీరు లేదని వ్యాఖ్యానించారు.
బల నిరూపణకు మరో ఎమ్మెల్యే డౌట్!
ఇక మరో ఎమ్మెల్యే చమ్రా లిండా కొన్ని రోజులుగా పార్టీ అధిష్ఠానంతో సంప్రదింపులు నిలిపివేశారని సమాచారం. ఆయన అన్ని పార్టీ మీటింగ్‌లకు గైర్హాజరు అవుతుండటం వల్ల సోమవారం బలనిరూపణకు వస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొంది.
హైదరాబాద్ నుంచి రాంచీకి వెళ్లనున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు
బలనిరూపణ కోసం సోమవారం నుంచి రెండ్రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జేఎంఎం పార్టీకి చెందిన 36 మంది ఎమ్మెల్యేలను ఫిబ్రవరి 2న హైదరాబాద్‌కు తరలించింది అధిష్ఠానం. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని శామీర్‌పేట లియోనియా రీసార్ట్స్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బలపరీక్ష కోసం తిరిగి రాంచీ పయమనమయ్యారు.
మరోవైపు ఈ బల నిరూపణలో పాల్గొనేందుకు హేమంత్ సోరెన్ కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నహేమంత్ సోరెన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శనివారం విచారించిన ప్రత్యేక న్యాయస్థానం బల పరీక్షలో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ ఆదివారం రాంచీలో అధికారులతో సమీక్షించారు. డీజీపీ, ఇతర సీనియర్ అధికారులతో రాష్ట్రంలోని శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ సంబంధించిన విషయాలపై చర్చించారు.
మాజీ సీఎం అరెస్ట్‌పై విచారణకు సుప్రీం నో- హేమంత్ సోరెన్‌కు 5రోజుల రిమాండ్