Jammu Kashmir Terror Attacks : జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు జరిగాయి. మంగళవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతంకాగా, ఓ జవాన్ అమరుడయ్యారు. ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
దొడా జిల్లాలోని భదర్వా- పఠాన్‌కోట్ రహదారిపై చటర్‌గాలా ఎగువ భాగంలో ఉన్న ఉమ్మడి చెక్‌పోస్ట్‌పై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సైనికులతో పాటు ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కథువా జిల్లా సైదా సుఖాల్ గ్రామంలో నక్కిన ఉగ్రవాది కోసం భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. తప్పించుకునే క్రమంలో ముష్కరుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ కబీర్‌దాస్ తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు, మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో హీరానగర్ సెక్టార్‌లోని ఒక ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఇంటి యజమాని గాయాలపాలయ్యారు. దానిపై సమాచారం అందుకున్న పోలీసులు, పారామిలిటరీ బలగాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరి కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 15గంటల ఆపరేషన్ తర్వాత భద్రతాదళాలు మరో ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్‌లో భాగంగా ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్న వాహనానికి బుల్లెట‌్లు తగిలినప్పటికీ వారు సురక్షితంగా బయటపడినట్లు భద్రతా దళాలు తెలిపాయి.
'సంబరాల్లో మోదీ బిజీ'
బీజేపీ పాలనలో దేశంపై ఉగ్రదాడులు చేస్తున్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 'జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలు నెలకొంటున్నాయని, సాధారణ పరిస్థితులే ఉంటున్నాయని బీజేపీ చెబుతోంది. అవన్ని తప్పుడు వాదనలే అని గత మూడు రోజులుగా జరుగుతున్న ఉగ్రదాడుల ద్వారానే తెలుస్తుంది. అభినందన సందేశాలకు రిప్లై ఇచ్చే పనిలో నరేంద్ర మోదీ బిజీగా ఉన్నారు. అందుకే జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనలు కూడా వినలేకపోతున్నారు' అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇన్ఛార్జ్ పవన్ ఖేడా కూడా ప్రశ్నించారు. పాకిస్థాన్ నాయకులకు అభినందన సందేశాలకు సమాధానాలు చెప్పడానికి మోదీకి సమయం ఉందని, ఉగ్రదాడులను ఖండించడానికి మాత్రం లేదని విమర్శించారు.
రియాసీ బస్సు దాడి ఉగ్రవాదిపై రివార్డ్
జూన్ 9న రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. మరో 41మంది భక్తులు గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరి ఊహాజనిత చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఉగ్రవాదులు గురించి సమాచారం అందించిన వారికి రూ.20 లక్షలు రివార్డును ప్రకటించారు.
గుడిసెపై ఇసుక ట్రక్కు బోల్తా- ఒకే కుటుంబంలోని 8మంది స్పాట్ డెడ్
అతివిశ్వాసం వల్లే బీజేపీ ఇలా- 'గాలిబుడగ'ను నమ్ముకుని ప్రచారం చేసి!: RSS - Lok Sabha Results 2024