Supreme Court On Isha Foundation Issue : మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నారన్న కేసులో ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఫౌండేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. అందుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు వివరాలను తమకు సమర్పించాలని వెల్లడించింది. ఈ వ్యవహారంపై ఇద్దరు యువతుల తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం తనకు తాను బదిలీ చేసుకుంది.
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈశా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండి పోయారని తెలిపారు. ఈ విషయమై ఇదివరకే దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు, పరిశీలించి నివేదిక దాఖలు చేయాలని కోయంబత్తూరు పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. ఆ తర్వాత తమను ఇబ్బందికి గురిచేయకూడదని కుమార్తెలు సివిల్ కేసు వేశారని, దీంతో తాను, తన భార్య మానసికంగా ప్రభావితమైనట్లు పిటిషనర్ తెలిపారు.
తమ కుమార్తెలను గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈశా యోగా కేంద్రానికి వ్యతిరేకంగా తాను ఏ ఆందోళన చేయకూడదని, అలా చేస్తే చనిపోయేవరకు నిరాహారదీక్ష చేపడతానని తన రెండో కుమార్తె హెచ్చరించిందని చెప్పారు. తమ కుమార్తెలు అక్కడి నుంచి బయటకొస్తే వారిని ఇబ్బందిపెట్టమని, ప్రత్యేక స్థలం ఇచ్చి వారి ఏకాంతాన్ని కాపాడతానని అన్నారు. తమ కుమార్తెలను అప్పగించాలని కోరారు.
అయితే ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులను తాజాగా మద్రాసు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈశా ఫౌండేషన్ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది. సుమారు 150 మంది పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి, ప్రతి మూల శోధించారని ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి పోలీసు చర్యలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.